షోలే ప్రతిష్ఠ దిగజార్చవద్దు

భారతీయ సినిమా కీర్తి ప్రతిష్ఠలను ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ‘షోలే’ చిత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆ పేరును వ్యాపార లోగోల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం దుర్వినియోగం

Published : 27 May 2022 05:24 IST

ఆ సినిమా పేరుపై హక్కు చిత్ర నిర్మాతలదే: దిల్లీ హైకోర్టు తీర్పు

దిల్లీ: భారతీయ సినిమా కీర్తి ప్రతిష్ఠలను ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ‘షోలే’ చిత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆ పేరును వ్యాపార లోగోల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయటం తగదని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ‘షోలే’ పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించిన సంస్థకు రూ.25లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని చిత్ర నిర్మాతలైన షోలే మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిప్పీ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు మూడు నెలల్లోగా చెల్లించాలని జస్టిస్‌ ప్రతిభ ఎం.సింగ్‌ తీర్పు నిచ్చారు. సినిమాల టైటిళ్లు వ్యాపారచిహ్నాలు(ట్రేడ్‌మార్క్‌)గా వినియోగించుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘షోలే’ పేరును తమ వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోవడానికి ప్రతివాదులు 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ చిత్రంలోని దృశ్యాలతో డీవీడీలు రూపొందించి తమ వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించాలని ప్రయత్నించడాన్ని దురుద్దేశపూరిత చర్యగా నిర్ధరించారు. ఈ వ్యాజ్యంలో పిటిషనర్లైన షోలే మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు నష్టపరిహారం, దావా ఖర్చుల కింద రూ.25లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రతివాదులు, వారి భాగస్వాములు, వారి సంబంధీకులు ఎవరూ కూడా ‘షోలే’ పేరును వారందించే సేవలకు వినియోగించరాదని స్పష్టం చేశారు. ఇంటర్నెట్‌ ద్వారా వ్యాపార నిర్వహణ కోసం ‘షోలే.కామ్‌’ పేరుతో డొమైన్‌ ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొన్నారు. 1975 ఆగస్టు 15న విడుదలైన ‘షోలే’ సినిమాపై, ఆ టైటిల్‌పై సర్వహక్కులు ఆ చిత్ర నిర్మాతలకే ఉంటాయన్నారు. సినిమాల పేర్లకు నిర్ణీత కాలం తర్వాత చట్టపరమైన రక్షణ ఉండదన్న ప్రతివాదుల వాదనను కోర్టు తిరస్కరించింది. చిత్ర నిర్మాతలు అధిక ధనం రాబట్టుకోవడం కోసమే దావా వేశారన్న ఆరోపణలనూ పరిగణనలోకి తీసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని