ఉద్యోగ దరఖాస్తుదారుకు చట్టబద్ధమైన హక్కేమీ లభించదు

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సంబంధిత నియామకాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని, ఆ ప్రక్రియకు సహేతుకమైన ముగింపునివ్వాలని ఒత్తిడి చేసే హక్కేమీ లభించబోదని సుప్రీంకోర్టు

Published : 27 May 2022 05:24 IST

నియామక ప్రక్రియను ముగించాలని కోరలేరు

సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

దిల్లీ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి సంబంధిత నియామకాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని, ఆ ప్రక్రియకు సహేతుకమైన ముగింపునివ్వాలని ఒత్తిడి చేసే హక్కేమీ లభించబోదని సుప్రీంకోర్టు తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాలో ఆ దరఖాస్తుదారు పేరు ఉన్నప్పటికీ..అటువంటి హక్కును పొందలేరని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) 2018 మార్చి 1న తన పరిధిలోని కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టు భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత 20 రోజులకు పరిపాలనాపరమైన కారణాలతో నియామక ప్రక్రియను నిలిపివేస్తూ నోటీసు జారీ చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఒకరు నియామక ప్రక్రియను కొనసాగించేలా ఈఎస్‌ఐసీని ఆదేశించాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ను (క్యాట్‌) ఆశ్రయించగా అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై కర్ణాటక హైకోర్టును ఈఎస్‌ఐసీ ఆశ్రయించగా...45 రోజుల్లో నియమాక ప్రక్రియను ముగించాలనే ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఈఎస్‌ఐసీ...సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. కేసును విచారించిన జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం...నోటిఫికేషన్‌ను నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీనివల్ల కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోకుండా ఉంటారని, అటువంటి పరిస్థితుల్లో 45 రోజుల్లో నియామక ప్రక్రియను ముగించమని ఆదేశించడంలో ఔచిత్యం లేదంది. కర్ణాటక హైకోర్టు తీర్పును కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని