రానున్న కాలం.. డ్రోన్లదే: మోదీ

రానున్న కాలంలో ప్రజల జీవితాల్లో డ్రోన్లు కీలకపాత్ర పోషించనున్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఇవి దేశంలో ప్రతి రంగాన్ని ప్రభావితం చేయనున్నాయని తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ల సాంకేతికతలో

Published : 28 May 2022 06:02 IST

దిల్లీ: రానున్న కాలంలో ప్రజల జీవితాల్లో డ్రోన్లు కీలకపాత్ర పోషించనున్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఇవి దేశంలో ప్రతి రంగాన్ని ప్రభావితం చేయనున్నాయని తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ల సాంకేతికతలో భారత్‌.. అంతర్జాతీయ కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. శుక్రవారం మోదీ.. దిల్లీలో అతి పెద్ద డ్రోన్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ‘‘2014కు ముందు ప్రభుత్వాలు సాంకేతికతను ఓ సమస్యగా చూశాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకిగా భావించాయి. పాలనలో టెక్నాలజీని వాడటానికి ఇష్టపడలేదు. దీంతో ఆ తరగతి ప్రజలు నష్టపోయారు. మా ప్రభుత్వం వచ్చాక దీన్ని మార్చాం. ఇప్పుడు దేశంలో చిట్టచివరి వ్యక్తికి కూడా టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ.. ప్రతి భారతీయుడి చేతిలో స్మార్ట్‌ఫోన్‌, ప్రతి పొలంలో డ్రోన్‌, ప్రతి ఇంటిలోనూ సౌభాగ్యం వర్థిల్లాలన్నది నా కల’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్‌ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టాలని దేశ విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, మన్‌సుఖ్‌ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని