Updated : 29 May 2022 06:00 IST

తల దించుకొనే పని చేయలేదు

 8 ఏళ్ల పాలనలో మాతృభూమి సేవలో రాజీ పడలేదు

 గాంధీ, పటేల్‌ కలలను నెరవేర్చేందుకే ప్రయత్నించా 

గుజరాత్‌ సభలో మోదీ 

రాజ్‌కోట్‌: గత ఎనిమిదేళ్ల పరిపాలనలో దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకొనే పని తానొక్కటీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికే అహర్నిశలూ కృషి చేశానని, మహత్మాగాంధీ, సర్దార్‌ పటేల్‌ కలలు నెరవేర్చేందుకు నిజాయతీగా ప్రయత్నించానని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన మోదీ.. శనివారం రాజ్‌కోట్‌లోని అత్కోట్‌లో పటేల్‌ సేవా సమాజ్‌ నిర్మించిన 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ.. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ‘‘మూడు కోట్ల మందికి పక్కా గృహాలు, 10 కోట్లకు పైగా కుటుంబాలకు బహిరంగ మల విసర్జన నుంచి విముక్తి, తొమ్మిది కోట్లకు పైగా మహిళలకు వంటగది పొగ నుంచి రక్షణ, 2.5 కోట్లకు పైగా కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్లు, ఆరు కోట్లకు పైగా కుటుంబాలకు కుళాయి నీరు, 50 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ఆరోగ్య సదుపాయాలు.. ఇవి అంకెలు కాదు, పేద ప్రజల పట్ల మా చిత్తశుద్ధికి సాక్ష్యం’’ అని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో.. దేశ ఆహార భాండాగారాలను తెరిచామని చెప్పారు.  

ఎరువుల భారం రైతులపై పడనీయలేదు

తర్వాత మోదీ గాంధీనగర్‌లో ‘సహకారంతో సమృద్థి’ సదస్సులో పాల్గొన్నారు. కొవిడ్‌-19, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఎరువులు ధరలు పెరిగాయని, అయినా ఆ ధరల భారం రైతులపై పడకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. గాంధీనగర్‌లో కలోల్‌లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా కర్మాగారాన్ని ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో ద్రవరూపంలో యూరియా తయారుకానుంది. ‘‘50 కేజీల యూరియా బస్తాకు ఎంత శక్తి ఉంటుందో.. ఇక్కడ తయారయ్యే అరలీటర్‌ సీసాకూ అంతే సామర్థ్యం ఉంటుంది. ఇలాంటివి దేశంలో మరో 8 రానున్నాయి’’ అని మోదీ తెలిపారు.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని