ఆధార్‌ నమోదైతేనే ‘పీఎం కిసాన్‌’!

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌) పథకం కింద రాష్ట్రంలో లక్షల మంది రైతుల ఆధార్‌ వివరాలు ఇంకా నమోదు కాలేదు. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన రైతులను గుర్తించడానికి కేంద్రం అనేక నిబంధనలు పెట్టింది.

Updated : 31 May 2022 10:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం కిసాన్‌) పథకం కింద రాష్ట్రంలో లక్షల మంది రైతుల ఆధార్‌ వివరాలు ఇంకా నమోదు కాలేదు. ఇప్పటికే ఈ పథకం కింద అర్హులైన రైతులను గుర్తించడానికి కేంద్రం అనేక నిబంధనలు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) నుంచి ఆధార్‌ నమోదునూ తప్పనిసరి చేసింది. ఈకేవైసీ పూర్తిచేయడానికి, కొత్తగా ‘పీఎం కిసాన్‌’లో నమోదుకు తొలుత 2022 మార్చి 31 దాకా కేంద్రం గడువు పెట్టింది. అప్పటికి రైతులు స్పందించలేదని గడువును ఈ నెల 31 దాకా పొడిగించింది. ఇప్పటికీ తెలంగాణలో 11 లక్షల మంది రైతులే ఆధార్‌ నమోదు చేశారని.. మిగతావారితో ఎప్పుడు చేయిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావును ‘ఈనాడు’ సంప్రదించగా.. మరో 20 నుంచి 25 రోజుల్లో పూర్తిచేస్తామని తెలిపారు. జులై 31 దాకా గడువు పొడిగించనున్నట్లు సమాచారం ఉందని వివరించారు. రైతు బ్యాంకు ఖాతాలో ఒక్కో విడత రూ.2 వేల చొప్పున ఆర్థిక సంవత్సరంలో 3 దఫాలుగా మొత్తం రూ.6 వేలు కేంద్రం జమచేస్తోంది. దేశవ్యాప్తంగా గతేడాది 11.11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమచేయగా తెలంగాణలో 37.62 లక్షల మందికి అందాయి.  

ఇలా నమోదు చేయాలి...

పీఎం కిసాన్‌ పోర్టల్‌లోకి వెళితే ‘ఈకేవైసీ’ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్‌ చేస్తే ఆధార్‌ సంఖ్యను నమోదు చేయాలని అడుగుతుంది. నమోదు చేయగానే ఆ సంఖ్యతో అనుసంధానమై ఉన్న రైతు ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. కానీ, ఈ ప్రక్రియలో అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నో ఏళ్ల క్రితం ఆధార్‌ కార్డు తీసుకున్నప్పుడు ఇచ్చిన ఫోన్‌ నంబరు ఇప్పుడు కొందరు వాడటం లేదు. ఓటీపీ రావాలంటే ఆధార్‌తో అనుసంధానం చేసిన ఫోన్‌ నంబరే రైతు వద్ద ఉండాలి. ఒకవేళ ఆ నంబరు మారితే ముందుగా ఆధార్‌ కేంద్రానికి వెళ్లి కొత్త నంబరును నమోదు చేయించాలి. కొత్త నంబరు ఆధార్‌కు అనుసంధానమైన తర్వాత పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఈకేవైసీ నమోదు పూర్తిచేయాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని