నేతలు పరస్పరం గౌరవించుకోవాలి

‘ఈ కాలం రాజకీయ నేతలకు నా సలహా. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు ఆలోచనా విధానాలు దానికి అనుగుణంగా ఉంటాయి. వారంతా ఉన్నది తమ మార్గాల్లో ప్రజలకు సేవ చేయడానికే.

Updated : 29 May 2022 06:13 IST

 పార్టీలనేవి ప్రజా సేవ కోసమే 

 ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి హితవు

చెన్నై, న్యూస్‌టుడే: ‘ఈ కాలం రాజకీయ నేతలకు నా సలహా. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు ఆలోచనా విధానాలు దానికి అనుగుణంగా ఉంటాయి. వారంతా ఉన్నది తమ మార్గాల్లో ప్రజలకు సేవ చేయడానికే. మార్గం ఒకటే అయినప్పుడు పరస్పరం కచ్చితంగా గౌరవించుకోవాలి. అంతే తప్ప శత్రువుల్లా చూడకూడదు’ అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపు నిచ్చారు. చెన్నైలోని అన్నాసాలై ఓమందూరర్‌ ప్రభుత్వ ఎస్టేట్‌ ప్రాంగణంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి విగ్రహాన్ని శనివారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. కరుణానిధి 99వ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాల్లోనూ పాల్గొని ప్రసంగించారు. కరుణానిధి సమర్థుడైన పాలకుడని, డైనమిక్‌ ముఖ్యమంత్రుల్లో ఒకరని చెప్పారు. బలహీనవర్గాలకు సంక్షేమంతోపాటు సామాజిక న్యాయాన్ని అందించారని తెలిపారు. నెల్లూరులో తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కరుణానిధిని గమనిస్తున్నానని, ఆయన ఆలోచనా విధానాలు ప్రభావవంతంగా ఉంటాయని చెప్పారు. 2001లో కరుణానిధి అరెస్టయినప్పుడు విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఆయనవైపు నిలిచానని గుర్తు చేశారు. దేశంలోని ప్రతి భాషా సంపదేనని, ముందు మాతృభాషను నేర్చుకోవాలని సూచించారు. మాతృభాషకు మద్దతిస్తూనే ఇతర భాషల్ని వ్యతిరేకించకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా వెంకయ్య నాయుడితో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. సమావేశంలో సినీనటులు రజనీకాంత్,  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు