మైడియర్‌ సుబ్బారావ్‌! నేనొచ్చేశా..

‘చెవిలో పెన్సిల్‌, చేతిలో సంచీ, ఖాకీ దుస్తులు, అరిగిన చెప్పులు’ అంటూ కవి తిలక్‌ వర్ణించిన ఒకప్పటి తపాలా బంట్రోతు ‘సుబ్బారావు’ నేటి ఆధునిక సమాజంలో దాదాపుగా కనుమరుగైపోతున్నాడు.

Published : 30 May 2022 09:37 IST

దేశంలో తొలిసారి డ్రోన్‌ ద్వారా పోస్టల్‌ డెలివరీ

అహ్మదాబాద్‌: ‘చెవిలో పెన్సిల్‌, చేతిలో సంచీ, ఖాకీ దుస్తులు, అరిగిన చెప్పులు’ అంటూ కవి తిలక్‌ వర్ణించిన ఒకప్పటి తపాలా బంట్రోతు ‘సుబ్బారావు’ నేటి ఆధునిక సమాజంలో దాదాపుగా కనుమరుగైపోతున్నాడు. అరకొరగా ఇంకా అక్కడక్కడా కనిపిస్తున్న ఈ రూపు ఆనవాళ్లను టెక్నాలజీ పూర్తిగా తుడిచిపెట్టే రోజులు వచ్చేశాయి. దేశంలో ప్రప్రథమంగా గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలో పోస్టల్‌శాఖ డ్రోన్‌ సాయంతో టపా పార్సిలు చేరవేసింది. పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ ప్రయోగంలో 46 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని 25 నిమిషాల్లో డ్రోన్‌ చేరుకొన్నట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. భుజ్‌ తాలూకాలోని హాబే గ్రామం నుంచి భచావూ తాలూకాలోని నేర్‌ గ్రామానికి ఈ టపా పంపారు. కేంద్ర సమాచారశాఖ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో డ్రోన్ల సాయంతో పోస్టల్‌ టపా చేరవేతలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఆర్థికంగా కూడా ఇది లాభదాయకం అనిపిస్తే పోస్టల్‌ సేవలు మరింత వేగంగా ప్రజలకు చేరుతాయన్నారు. డ్రోన్‌ ద్వారా  మెడికల్‌ పార్సిలు పంపినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి దేవసింహ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని