పంజాబీ గాయకుడి దారుణహత్య

ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఆదివారం నడిరోడ్డుపై ఆయన్ను కాల్చిచంపారు. సిద్ధూకు కల్పిస్తున్న భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కుదించిన మరుసటి రోజే ఈ ఘోరం చోటుచేసుకుంది. దీంతో సీఎం భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 28 ఏళ్ల సిద్ధూ ఇద్దరు మిత్రులతో కలిసి జీప్‌లో వెళ్తుండగా..

Published : 30 May 2022 05:11 IST

సిద్ధూ మూసేవాలాను నడిరోడ్డుపై కాల్చిచంపిన దుండగులు
రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించిన మరునాడే ఘోరం

చండీగఢ్‌: ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఆదివారం నడిరోడ్డుపై ఆయన్ను కాల్చిచంపారు. సిద్ధూకు కల్పిస్తున్న భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కుదించిన మరుసటి రోజే ఈ ఘోరం చోటుచేసుకుంది. దీంతో సీఎం భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 28 ఏళ్ల సిద్ధూ ఇద్దరు మిత్రులతో కలిసి జీప్‌లో వెళ్తుండగా.. జవహర్‌ కె గ్రామం వద్దకు చేరుకోగానే, ఎదురుగా రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు ఏకే-47 రైఫిళ్లతో కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో సిద్ధూయే వాహనం నడుపుతున్నారు. తూటాల వర్షంతో.. కూర్చున్న సీటులోనే ఆయన ఒరిగిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో సిద్ధూ స్నేహితులకూ తూటా గాయాలయ్యాయి.

శాంతిభద్రతల కారణం చూపుతూ సిద్ధూతో పాటు మొత్తం 424 మందికి పంజాబ్‌లోని ఆప్‌ సర్కారు శనివారం భద్రతను ఉపసంహరించుకుంది/కుదించింది. వారిలో మాజీ ఎమ్మెల్యేలు, డేరాల అధిపతులు, ప్రస్తుత/మాజీ పోలీసు అధికారుల వంటివారు ఉన్నారు. సిద్ధూకు ఇన్నాళ్లూ నలుగురు కమాండోలు రక్షణగా ఉండేవారు. అందులో ఇద్దరిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన ఇద్దరిని ఆయన ఆదివారం తన వెంట తీసుకెళ్లలేదు. సిద్ధూకు సొంతంగా తూటారక్షక వాహనం ఉన్నా.. దాన్నీ వినియోగించలేదు. సిద్ధూ మూసేవాలా అసలు పేరు శుభ్‌దీప్‌సింగ్‌ సిద్ధూ. తన పాటల్లో తుపాకీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆయనపై విమర్శలున్నాయి. ‘సంజూ’ అనే గీతం హింసను ప్రేరేపించేలా ఉండటంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. 

కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి..
సిద్ధూ గత ఏడాదే కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా స్థానం నుంచి పోటీ చేశారు. ఆప్‌ అభ్యర్థి విజయ్‌ సింగ్లా చేతిలో 63 వేలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

బిష్ణోయ్‌ ముఠా పనే: పోలీసులు
సిద్ధూ హత్య గ్యాంగ్‌స్టర్ల పనే అని పోలీసులు తెలిపారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ సన్నిహితుడు విక్కీ మిద్దుఖేడా మొహాలీలో గత ఏడాది హత్యకు గురయ్యారు. అందులో సిద్ధూ మేనేజర్‌ శగన్‌ప్రీత్‌ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో శగన్‌ప్రీత్‌ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. విక్కీ హత్యకు ప్రతీకారంగానే బిష్ణోయ్‌ ముఠా తాజా దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. సిద్ధూ హత్య తన పనేనని కెనడాలో నివసిస్తున్న గోల్డీ బ్రార్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. అతడు బిష్ణోయ్‌ ముఠా సభ్యుడే. సిద్ధూ హత్యపై సీఎం భగవంత్‌ మాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఆప్‌ సర్కారు గద్దె దిగాలని డిమాండ్లు
సిద్ధూ హత్యతో మాన్‌ సర్కారు అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్‌ రాజా వారింగ్‌ అన్నారు. మాన్‌ ప్రభుత్వం గద్దె దిగాలని భాజపా నేత మంజిందర్‌సింగ్‌ సిర్సా డిమాండ్‌ చేశారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయని మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌ చేతిలో రిమోట్‌: భాజపా
సిద్ధూ హత్యకు దిల్లీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ కారణమని భాజపా నిందించింది. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆయన పంజాబ్‌ను పాలిస్తున్నారని ఆరోపించింది. కమలదళం అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా దిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ.. ఎవరెవరి భద్రతను తొలగించారన్న జాబితాను ఆప్‌ సర్కారు గోప్యంగా ఉంచకుండా బహిరంగపర్చడమేంటని ప్రశ్నించారు. అది హంతకులకు ఆహ్వానం పలకడం వంటిదేనని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని