కేరళలో నోరోవైరస్‌ కలకలం

కేరళలో నోరోవైరస్‌ కలకలం రేపుతోంది. తిరువనంతపురంలోని విళింజంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కలుషిత నీరు, ఆహారం ద్వారా వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు

Published : 07 Jun 2022 04:29 IST

ఇద్దరు చిన్నారుల్లో వెలుగులోకి.. నివేదిక కోరిన కేంద్రం

దిల్లీ: కేరళలో నోరోవైరస్‌ కలకలం రేపుతోంది. తిరువనంతపురంలోని విళింజంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కలుషిత నీరు, ఆహారం ద్వారా వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కేంద్రప్రభుత్వం నోరోవైరస్‌ కేసులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతేడాది కూడా కేరళలో 950కి పైగా నోరోవైరస్‌ కేసులు బయటపడ్డాయి. కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం, వైరస్‌ సోకిన ఉపరితలాన్ని తాకడం ద్వారా నోరోవైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. చాలా దేశాల్లో ఉనికిలో ఉన్న ఈ వైరస్‌ను స్టమక్‌ ఫ్లూ, స్టమక్‌ బగ్‌ అని కూడా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 68కోట్ల నోరోవైరస్‌ కేసులు నమోదవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో 20కోట్ల కేసులు ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఉంటున్నాయి. డయేరియాకు కారణమయ్యే రోటావైరస్‌ మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి. నోరోవైరస్‌ సోకిన 12 నుంచి 48 గంటల్లో దాని లక్షణాలు మొదలై మూడు రోజుల వరకు ఉంటాయి.

లక్షణాలు ఇవీ..

ఈ వైరస్‌ సోకినవారిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జర్వం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. పరిస్థితి తీవ్రంగా మారితే డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. బాధితులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకినవారిలో దాదాపు 92శాతం మంది సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నారు. డీహైడ్రేషన్‌కు గురయ్యేవారు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు. అయితే మూడు రోజుల్లో దీన్నుంచి బయటపడొచ్చని నిపుణులు తెలిపారు.


కొత్తగా 4,518 కొవిడ్‌ కేసులు

దిల్లీ: వరుసగా కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న కొవిడ్‌-19 కేసుల్లో సోమవారం కూడా వృద్ధి కనిపించింది. గడిచిన 24 గంటల్లోనే 4,518 మంది కొత్తగా వైరస్‌ బారిన పడ్డారు. క్రియాశీలక కేసులూ పెరిగాయి. ఉదయం 8 గంటలకు కేంద్ర ఆరోగ్యశాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం.. క్రియాశీలక కేసులు 25,782. 24 గంటల్లోనే 1730 కేసులు పెరగడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని