Diabetes: టైప్‌-1 మధుమేహంతో ఆందోళన వద్దు

టైప్‌-1 మధుమేహం బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ డయాబెటిస్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ వి.మోహన్‌ అన్నారు. రోజూ క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ తీసుకుంటే దీర్ఘకాలం సాధారణ జీవితం

Updated : 08 Jun 2022 09:11 IST

క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ తీసుకుంటే దీర్ఘకాలం సాధారణ జీవితం గడపొచ్చు

‘ఈనాడు’తో ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ వి.మోహన్‌

ఈనాడు, దిల్లీ: టైప్‌-1 మధుమేహం బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ డయాబెటిస్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ వి.మోహన్‌ అన్నారు. రోజూ క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ తీసుకుంటే దీర్ఘకాలం సాధారణ జీవితం గడపొచ్చని పేర్కొన్నారు. ఈ రకం మధుమేహాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) జారీచేసిన నూతన మార్గదర్శకాల రూపకర్తల్లో ఒకరైన ఆయన తాజాగా ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ‘‘దేశంలో టైప్‌-1 మధుమేహ బాధితులు 2.5 లక్షల మంది దాకా ఉన్నారు. వీరు ఒక్కరోజు ఇన్సులిన్‌ తీసుకోకపోయినా మరణించే ముప్పు ఉంటుంది. రోజుకు 3-4సార్లు ఇన్సులిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ తరహా మధుమేహం సాధారణంగా 15 ఏళ్లలోపు పిల్లల్లో వస్తుంది. అయితే కేవలం పిల్లలకే పరిమితం అవుతుందనుకోవడానికి వీల్లేదు. పెద్దల్లోనూ రావొచ్చు. దేశంలో టైప్‌-1 మధుమేహ బాధితుల సంఖ్య ఏటా 10 వేల వరకూ పెరుగుతోంది. ప్రధానంగా జన్యులోపం కారణంగా ఈ వ్యాధి వస్తుంది. బాధితులు ఇన్సులిన్‌ తీసుకుంటూ ఉంటే సాధారణ జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదు. ప్రస్తుతం ఈ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగానే అందిస్తున్నారు. అనవసరంగా నాటువైద్యుల సలహాలతో మూలికలు, పసరు వంటివి వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’’ అని వి.మోహన్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని