త్రిదళాధిపతి పదవికి మరింత మంది అర్హులు

ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న త్రిదళాధిపతి(సీడీఎస్‌) పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ హోదాకు అర్హత పరిధిని పెంచుతూ నిబంధనలను సవరించింది. ఈ మేరకు

Updated : 08 Jun 2022 05:38 IST

 లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారులకూ అవకాశం

నిబంధనలను సవరించిన కేంద్రం

దిల్లీ: ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న త్రిదళాధిపతి(సీడీఎస్‌) పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ హోదాకు అర్హత పరిధిని పెంచుతూ నిబంధనలను సవరించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్లు జారీ చేసింది. దీని ప్రకారం త్రివిధ దళాల ప్రస్తుత అధిపతులతోపాటు లెఫ్టినెంట్‌ జనరల్‌, ఎయిర్‌ మార్షల్‌, వైస్‌ అడ్మిరల్‌ హోదాలో పనిచేస్తున్న, విశ్రాంత అధికారులు కూడా సీడీఎస్‌ పదవికి అర్హులేనని పేర్కొంది. అయితే వీరి వయసు 62 ఏళ్ల లోపు ఉండాలని తెలిపింది. ఈ లెక్కన త్రివిధ దళాల్లో రెండో అత్యధిక హోదాలో ఉండే ‘త్రీస్టార్‌ అధికారులు’ కూడా అర్హులే. తమకన్నా పైస్థాయిలో ఉన్న సైనిక, నౌకాదళ, వాయుసేనాధిపతుల (4 స్టార్‌ అధికారులు)ను తోసిరాజని ఈ ఉన్నత పదవిని వీరు చేపట్టవచ్చు.

* త్రివిధ దళాల అధిపతులు 62 ఏళ్ల వయసు వచ్చేవరకూ లేదా మూడేళ్లపాటు (ఏది ముందైతే అది) పదవిలో కొనసాగుతారు. అయితే ఇటీవల రిటైర్‌ అయిన సైన్యాధిపతి జనరల్‌ నరవణె, వైమానిక దళాధిపతి ఆర్‌.కె.ఎస్‌.భదౌరియా, నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరంబిర్‌ సింగ్‌లకు 62 ఏళ్లు నిండటంతో త్రిదళాధిపతి పదవికి అవకాశం కోల్పోయారు.

* లెఫ్టినెంట్‌ జనరల్‌, ఎయిర్‌ మార్షల్‌, వైస్‌ అడ్మిరల్‌ హోదా అధికారులు 60 ఏళ్లకే పదవీ విరమణ పొందుతారు. అందువల్ల గత రెండేళ్లలో రిటైర్‌ అయిన వారిని త్రిదళాధిపతి పదవికి పరిగణనలోకి తీసుకోవచ్చు.

* ప్రస్తుత, విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌, ఎయిర్‌ మార్షల్‌, వైస్‌ అడ్మిరల్‌ హోదా అధికారులును త్రిదళాధిపతి పదవికి అర్హులుగా పేర్కొంటూ సైనిక, వైమానిక దళ, నౌకాదళ చట్టాల్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం వేర్వేరు గెజిట్‌ నోటిఫికేషన్లను కూడా జారీ చేసింది.

* త్రిదళాధిపతి సర్వీసును అవసరాన్ని బట్టి పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే అది గరిష్ఠంగా 65 ఏళ్ల వయసు వరకే ఆ పెంపు వర్తిస్తుంది.

* ప్రస్తుత త్రివిధదళాల అధిపతుల్లో వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధురి అత్యంత సీనియర్‌గా ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా నౌకాదళాధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌, సైన్యాధిపతి మనోజ్‌ పాండే ఉన్నారు.

* 2020 జనవరి 20న భారత తొలి త్రిదళాధిపతిగా జనరల్‌ బిపిన్‌ రావత్‌ బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది డిసెంబర్‌ 8న హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన చనిపోయినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని