నీట్‌ పీజీ సీట్ల భర్తీపై పిటిషన్ల కొట్టివేత

నీట్‌ పీజీ- 2021కు జాతీయస్థాయిలో మిగిలిపోయిన 1,456 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

Published : 11 Jun 2022 03:39 IST

కౌన్సెలింగ్‌ నిర్వహించరాదన్న నిర్ణయం సబబే : సుప్రీంకోర్టు

దిల్లీ: నీట్‌ పీజీ- 2021కు జాతీయస్థాయిలో మిగిలిపోయిన 1,456 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రజారోగ్యం, వైద్యవిద్య ప్రయోజనాల దృష్ట్యా నీట్‌ పీజీ-2021కు జాతీయస్థాయిలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించబోమని కేంద్రం, మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) పేర్కొన్నాయని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. వైద్యవిద్య నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని, అలా చేస్తే ప్రజారోగ్యం ప్రభావితమవుతుందని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన సెలవుకాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రవేశాల ప్రక్రియ ముఖ్యంగా వైద్యవిద్యలో అంతు లేనిదిగా ఉండరాదని, అది నిర్దిష్ట సమయంలోపు ముగిసేలా ఉండాలంది. మిగులు సీట్లను ఇప్పుడు భర్తీ చేస్తే ప్రస్తుత ఏడాదిపై ప్రభావం పడుతుందన్న కేంద్రం వివరణతో ఏకీభవిస్తున్నామన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

నర్సింగ్‌ కోర్సుల్లో భర్తీ కొనసాగింపునకూ తిరస్కృతి

2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి దిల్లీలో నర్సింగ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి అదనపు మాపప్‌ రౌండ్‌ నిర్వహించాలంటూ కేంద్రాన్ని, భారత నర్సింగ్‌ మండలిని ఆదేశించాలన్న పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2021-22 విద్యాసంవత్సరానికి దిల్లీలోని నర్సింగ్‌ కోర్సులకు సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది మార్చి 31తో పూర్తికాగా, నర్సింగ్‌ సంస్థల్లో ఇంకా 110 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని