Updated : 12 Jun 2022 06:40 IST

ఆగని హింస.. విధ్వంసం

తూటా గాయాలతో రాంచీలో ఇద్దరి మృతి
హావ్‌డాలో రెండో రోజూ కొనసాగిన అల్లర్లు
గృహాలకు నిప్పంటించిన ఆందోళనకారులు
పశ్చిమ బెంగాల్‌ భాజపా అధ్యక్షుడి గృహ నిర్బంధం
యూపీలో 255మంది... మహారాష్ట్రలో 100 మంది అరెస్టు

దిల్లీ/రాంచీ/కోల్‌కతా: దేశంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన హింస, విధ్వంస ఘటనలు వరుసగా రెండో రోజు కూడా కొనసాగాయి. పశ్చిమబెంగాల్లోని హావ్‌డా జిల్లాలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి పలు గృహాలకు నిప్పంటించారు. అల్లర్లు పొరుగు జిల్లాలకు విస్తరించకుండా కట్టడి చేసేందుకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో బుల్లెట్‌ గాయాలతో ఇద్దరు యువకులు మృతి చెందారు. శుక్రవారంనాటి దాడులకు నిరసనగా ఓ వర్గం ప్రజలు బంద్‌ నిర్వహించారు. రాంచీని కుదిపేసిన ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రల్లో హింసాయుత ఘటనల్లో పాల్గొన్న వారి అరెస్టుల ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్‌ రాజధాని   శ్రీనగర్‌, చెనాబ్‌ వ్యాలీ తదితర ప్రాంతాల్లో శనివారం కూడా కర్ఫ్యూ విధించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన యూట్యూబర్‌ ఫైజల్‌ వానిని పోలీసులు అరెస్టు చేశారు.

మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలకు గాను భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. ఆ ఘటనల ప్రభావం కొన్ని ప్రాంతాల్లో శనివారం కూడా కనిపించింది. హావ్‌డాలోని పాంచలా బజార్‌లో నిరసనకారులు పోలీసులతో ముఖాముఖి తలపడ్డారు. రాళ్లు విసరడంతో భద్రత సిబ్బందిలో పలువురికి గాయాలయ్యాయి. దుండగులు పలు ఇళ్లకు నిప్పంటించారు. భాజపా కార్యాలయాలపై దాడి చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు గుమిగూడకుండా సెక్షన్‌ 144ను విధించారు. హింసాయుత ఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, బలుర్‌ఘాట్‌ ఎంపీ సుకంతా మజుందార్‌ను శనివారం మధ్యాహ్నం పోలీసులు తొలుత గృహనిర్బంధంలో ఉంచి ఆ తర్వాత అరెస్టు చేశారు. దీనికి నిరసనగా భాజపా కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. హావ్‌డాలో శాంతిభద్రతల వైఫల్యంపై పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తూ పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. హావ్‌డా జిల్లాలో అల్లర్లకు సంబంధించి 60 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రదర్శకులపై దిల్లీలో కేసుల నమోదు

దిల్లీలోని జామా మసీదు వద్ద అనుమతిలేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు శనివారం పలువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 188 కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏ ఒక్క సంస్థ పేరునూ ప్రస్తావించలేదు. ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ నేతలు నుపుర్‌శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇస్లామిక్‌ విద్యార్థుల సంస్థ, ముస్లిం విద్యార్థుల సమాఖ్య శనివారం దిల్లీ విశ్వవిద్యాలయంలో ధర్నా నిర్వహించాయి.

కాన్పుర్‌లో నిందితుడి ఇల్లు కూల్చివేత

వారం క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జరిగిన హింసకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తి అనుచరుడి నాలుగు అంతస్తుల భవనాన్ని నగరాభివృద్ధి సంస్థ అధికారులు శనివారం కూల్చివేశారు. రాళ్ల దాడి ఘటనల్లో మహమ్మద్‌ ఇస్తియాక్‌ ప్రధాన నిందితుడని, హింసకు కుట్రపన్నిన జఫర్‌ హయత్‌ హష్మీకి అతను ముఖ్యమైన అనుయాయని కాన్పుర్‌ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ ఆనంద్‌ ప్రకాశ్‌ తివారి తెలిపారు. నిబంధనల ప్రకారమే కూల్చివేత చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో శుక్రవారం నాటి అల్లర్లకు సంబంధించి యూపీ పోలీసులు శనివారం సాయంత్రం వరకు 255 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన 100 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

అరెస్టులు అప్రజాస్వామికం

మత ప్రవక్తకు జరిగిన అవమానంపై నిరసన తెలిపే హక్కు ముస్లింలకు ఉందని జమీయత్‌ ఉలేమా ఏ హింద్‌ పేర్కొంది. అటువంటి హక్కును నిరాకరించేలా అరెస్టులు చేయడం, కాల్పులు జరపడం అప్రజాస్వామికమే అవుతోందని ఆరోపించింది. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు వేధింపులకు పాల్పడడం, పరిస్థితులను అదుపు చేయలేకపోవడం.. అగ్నికి ఆజ్యం పోసినట్లైందని సంస్థ ప్రధాన కార్యదర్శి మౌలానా హకీముద్దీన్‌ విమర్శించారు.


పోలీసుల దిగ్బంధంలో రాంచీ

పలు హింసాత్మక ఘటనలు జరిగిన రాంచీ నగరంలో శనివారం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో సాయుధ పోలీసులను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్షన్‌ 144 విధించారు. శుక్రవారం నాటి కాల్పుల ఘటనలో బుల్లెట్‌ గాయాలైన ఇద్దరు యువకులు ఆసుపత్రిలో మృతి చెందారు. వారి అంత్యక్రియలు సాఫీగా జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాళ్ల దాడి, కాల్పుల్లో భద్రతా సిబ్బంది సహా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. 21 మంది ఆస్పత్రిలో చేరగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారిలో రాంచీ ఎస్‌ఎస్‌పీ సురేంద్ర కుమార్‌ కూడా ఉన్నారు. జిల్లాలో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతను ఆదివారం ఉదయం వరకూ పొడిగించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కొందరు దుండగులు ఓ వర్గానికి చెందిన ప్రార్థనాస్థలిపై పెట్రోల్‌ బాంబులు విసిరారు. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి వచ్చే సరికి నిందితులు పరారయ్యారు. హింసాయుత ఘటనలకు నిరసగా శనివారం రాంచీలో పలు హిందుత్వ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి.


 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని