Agnipath: మంటలు రేపిన అగ్నిపథ్‌

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై గురువారం దేశం భగ్గుమంది. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలో సైన్య నియామక

Updated : 17 Jun 2022 06:44 IST

పలు రాష్ట్రాల్లో నిరసనల వెల్లువ

బిహార్‌లో అయిదు రైళ్లకు నిప్పు

యూపీ, హరియాణాలోనూ చెలరేగిన హింస

ప్రభుత్వ, ప్రైవేట్‌ వాహనాల ధ్వంసం

పథకంపై తీవ్రస్థాయిలో ప్రతిపక్షాల ధ్వజం

సైన్యం బలోపేతానికి తెచ్చామన్న కేంద్రం

దిల్లీ/పట్నా/లఖ్‌నవూ: సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై గురువారం దేశం భగ్గుమంది. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలో సైన్య నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పలు రాష్ట్రాల్లో యువత ఆందోళనలు చేపట్టింది. ఇవి కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. బిహార్‌లో అయిదు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వివిధ రాష్ట్రాల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. బస్సుల అద్దాలు పగిలాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ వాహనాలు దగ్ధమయ్యాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్విన ఘటనల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కొన్ని చోట్ల భద్రతా బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. యూపీ, హరియాణాల్లోనూ హింస చెలరేగింది. ఆందోళనల కారణంగా 34 రైళ్లు పూర్తిగా, ఎనిమిది పాక్షికంగా రద్దు అయ్యాయి. 72 రైళ్లు.. ఆలస్యంగా నడుస్తున్నాయి. బిహార్‌లో భాజపా ఎమ్మెల్యేపైనా దాడి జరిగింది. ‘‘మేం దీనిపై ఎంతకాలమైనా పోరాడతాం. ‘అగ్నిపథ్‌’ పేరుతో నాలుగేళ్ల ఉద్యోగం మాకు అక్కర్లేదు. పాత పద్ధతిలోనే సైన్యంలోని నియామకాలు జరగాలి’’ అని సైనిక ఉద్యోగార్థి ఒకరు తెలిపారు. ఈ పథకంపై ప్రతిపక్షాలూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అగ్నిపథ్‌ పేరుతో దేశంలో యువతను నిరుద్యోగులుగా మార్చి, పింఛను డబ్బులు ఆదా చేసుకోవడానికి ప్రభుత్వం చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించాయి. సైన్యాన్ని బలహీనపరిచే యత్నాలను మానుకోవాలని.. తక్షణమే ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కేంద్రం ఈ పథకంపై కల్పితాలు.. వాస్తవాలు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. సాయుధ బలగాల బలోపేతానికి ఈ కొత్త నమూనా తెచ్చామని పేర్కొంది. యువతకు కూడా ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.

గాల్లోకి కాల్పులు.. భాజపా ఎమ్మెల్యేపై దాడి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంతో 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న వారు త్రివిధ దళాలలో చేరవచ్చు. నాలుగేళ్ల పాటు సేవలు అందించాక వీరిలో 25 శాతం మంది మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. ఈ పథకం కింద చేరిన వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 46,000 మంది సైనికుల నియామకం చేపట్టనుంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది. అయితే దీనిపై బుధవారం బిహార్‌లో మెల్లగా మొదలైన ఆందోళన గురువారం 17 జిల్లాలకు విస్తరించాయి. నిరసనకారులు.. ఛాప్రా, కైమూర్‌, గోపాల్‌గంజ్‌ జిల్లాల్లో అయిదు రైళ్లను ఆగ్నికి ఆహుతి చేశారు. మరో 12 రైళ్లకు నష్టం కలిగించారు. జహానాబాద్‌, బక్సర్‌, నవాదా జిల్లాల్లో రైళ్లను నిలిపివేశారు. ఆరా పట్టణంలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. నవాదాలో భాజపా ఎమ్మెల్యే అరుణాదేవిపై ఆందోళనకారులు దాడి చేశారు. ఆమె వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు ఐదుగురికి గాయాలయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆగ్రా, అలీగఢ్‌, ఫిరోజాబాద్‌, మథుర, బులంద్‌శహర్‌ తదితర ప్రాంతాల్లోనూ పెద్దసంఖ్యలో యువకులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. బస్సులపై రాళ్లు విసిరారు. అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తున్న యువకులను శాంతింపచేయడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రయత్నించారు. నాలుగు సంవత్సరాల సర్వీసు అనంతరం రాష్ట్రప్రభుత్వం.. పోలీసు, ఇతర అనుబంధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని అన్నారు. హరియాణాలో దిల్లీ-జైపుర్‌ జాతీయ రహదారిని నిరసనకారులు దిగ్బంధించారు. పల్వల్‌లో ఆందోళన హింసాత్మకంగా మారింది. డిప్యూటీ కమిషనర్‌ ఇంటిపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. దీంతో ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, జమ్ము, దిల్లీలోనూ సైనిక ఉద్యోగార్థులు నిరసనలు తెలిపారు.


అగ్నివీరుల నియామకానికి ఈ ఏడాది వయోపరిమితి 23 ఏళ్లు 

ఈనాడు, దిల్లీ: గత రెండేళ్లుగా కొవిడ్‌-19తో సైన్యంలో భర్తీ ప్రక్రియ చేపట్టని కారణంగా 2022లో జరిపే అగ్నివీరుల నియామకానికి గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఈమేరకు గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం కింద సాయుధ దళాల్లో కొత్త నియామకాలకు పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్లవరకు అనుమతిస్తారు. అయితే కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టని విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 2022లో చేపట్టే నియామకాలకు మాత్రం ఒకసారి మినహాయింపు కింద ఈసారి అభ్యర్థులను 23 ఏళ్లవరకు అనుమతించాలని నిర్ణయించారు.


యువతకు అగ్నిపరీక్ష పెట్టకండి: రాహుల్‌గాంధీ

అగ్నిపథ్‌ పథకం అమలును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు. నిరుద్యోగుల సహనానికి అగ్నిపరీక్ష పెట్టొద్దని అంటూ ప్రధానికి విజ్ఞప్తి చేశారు ‘‘రెండేళ్ల వరకు ఎలాంటి ర్యాంకు, పింఛను ఉండదు. నియామకాలూ ఉండవు. నాలుగేళ్ల తర్వాత వారికి స్థిరమైన భవిష్యత్తు ఉండదు. సైన్యాన్ని కేంద్రం గౌరవించట్లేదు. దేశంలోని నిరుద్యోగుల అభ్యర్థనలను వినండి. అగ్నిపథ్‌లో నడిపించి వారి సహనానికి అగ్నిపరీక్ష పెట్టకండి’’ అని మోదీని ఉద్దేశించి.. రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కేవలం పింఛను డబ్బులు ఆదా చేసుకోవటానికే ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌ చేశారు. సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేవారికి దూరంగా ఉండాలని ఆందోళనలు చేపడుతున్న యువతను కేంద్రమంత్రి, భాజపా నేత అశ్వినీకుమార్‌ చౌబే కోరారు. ప్రధాని మోదీ ఎప్పుడూ యువత సంక్షేమం గురించే ఆలోచిస్తారని ఆయన పేర్కొన్నారు. అగ్నిపథ్‌ పథకంపై కేంద్రం పునరాలోచించాలని పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ .. కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ‘‘నాలుగేళ్లకు సైనికులను తీసుకోవడం సైన్యపరంగా సరైన నిర్ణయం కాదు’’ అని పేర్కొన్నారు. కేంద్రంలోని భాజపా నేతృత్వంలోని ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు 13 నెలలు అష్టకష్టాలు పడ్డారని,.. ఇప్పుడు యువత ఇబ్బందులు పడుతోందని రైతు నేత రాకేశ్‌ టికాయత్‌ వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ పథకాన్ని సమర్థించడం విశేషం. ‘‘ఇది ఎప్పుడో రావాల్సిన సంస్కరణ. సరైన దిశలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. సాయుధ బలగాల్లో ఉద్యోగం ఉపాధి హామీ పథకంగా మారకూడదు’’అని తివారీ పేర్కొన్నారు. అగ్నిపథ్‌పై ఎంపీ వరుణ్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకంపై యువతకు పలు అనుమానాలు ఉన్నాయని, వీటిని తక్షణమే ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మంది సైనికులు నిరుద్యోగులుగా మారతారని వరుణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని