Updated : 24 Jun 2022 06:14 IST

‘బ్రిక్స్‌ సహకారం’తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం

ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతూనే ఉందని, బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం ఆ వ్యవస్థ పునరుజ్జీవానికి ఇతోధికంగా దోహదపడగలదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆధ్వర్యాన గురువారం వీడియో ద్వారా జరిగిన ఈ సమావేశంలో... ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా కూడా పాల్గొన్నారు. మోదీ మాట్లాడుతూ- ‘‘మన దేశాల మధ్య నెలకొన్న పరస్పర సహకారం ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతోంది. వ్యాక్సిన్‌ పరిశోధన-అభివృద్ధి, ఔషధ ఉత్పత్తులను పరస్పరం గుర్తించుకోవడం వంటి చర్యలే ఇందుకు ఉదాహరణ. బ్రిక్స్‌ కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఇలాంటి చర్యల ద్వారా ప్రత్యేక అంతర్జాతీయ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. తాజా చర్చలో వచ్చిన సూచనలతో బ్రిక్స్‌ మరింత బలోపేతమవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. గ్లోబల్‌ ఎకానమీ నిర్వహణ విషయంలో కూటమి దేశాల విధానాల మధ్య సారూపత్య ఉండటం విశేషం. మన ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు’ సభ్యత్వాలు పెరగడం మరో శుభపరిణామం’’ అని పేర్కొన్నారు.

ఏకపక్ష ఆంక్షలను వ్యతిరేకిద్దాం: జిన్‌పింగ్‌

అమెరికాను ఉద్దేశించి జిన్‌పింగ్‌ పలు వ్యాఖ్యలు చేశారు. సభ్య దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరస్పరం మద్దతు పలుకుదామని; న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరిస్తూ ఐక్యతను చాటుకుందామని... ఏకపక్ష ఆంక్షలను, ఆధిపత్యాన్ని, బెదిరింపులను, విభజనను వ్యతిరేకిద్దామని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. అమెరికా, దాని మిత్రపక్షాలను లక్ష్యంగా చేసుకుని పుతిన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాల స్వార్థపూరిత, అనాలోచిత చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థిరత్వం, భద్రత, సుస్థిరాభివృద్ధి, ప్రజల శ్రేయస్సును కాంక్షించి బ్రిక్స్‌ దేశాలు కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. బ్రిక్స్‌ సమావేశానికి ముందు చైనాలో భారత రాయబారి ప్రదీప్‌కుమార్‌ రావత్‌... ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో ప్రశాంతతను కాపాడటం ద్వారా ఉభయ దేశాల పట్ల అంతర్జాతీయంగా విశ్వసనీయతను పెంపొందించుకోవాలని రావత్‌ సూచించారు. ఉభయ దేశాల మధ్య సంబంధాల పురోగతికి రెండు దేశాలు ఒకే దిశలో పనిచేయాల్సి ఉందని వాంగ్‌ యీ అన్నారు.

వ్యాక్సిన్లను సమానంగా పంపిణీ చేయాలి...

కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ వ్యాక్సిన్లను సమానంగా పంపిణీ చేయాలని బ్రిక్స్‌ దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోషిస్తున్న పాత్రకు మద్దతు పలుకుతున్నామంటూ ‘బీజింగ్‌ డిక్లరేషన్‌’లో పేర్కొన్నారు. వ్యాక్సిన్ల పంపిణీకి ఉద్దేశించి ఆ సంస్థ చేపట్టిన కొవాక్స్‌, యాక్ట్‌-ఎ కార్యక్రమాలకూ; అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఔషధాలు, ఆరోగ్య పరికరాల ఉత్పత్తిని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలకూ మద్దతు పలుకుతున్నట్టు స్పష్టం చేశారు.

* అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేందుకు కట్టుబడి ఉన్నట్టు డిక్లరేషన్‌లో విస్పష్టం చేశారు. ఉక్రెయిన్‌, అఫ్గానిస్థాన్‌ సమస్యలను చర్చించిన నేతలు... వీటిని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తీర్మానించారు.

* ఐక్యరాజ్య సమితిని మరింత సమర్థంగా, ప్రతిభావంతంగా తీర్చిదిద్దేందుకు భద్రతా మండలి సహా అనేక విభాగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని బ్రిక్స్‌ దేశాధినేతలు అభిప్రాయపడ్డారు.

* ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు స్వర్గధామంగా కొన్ని దేశాలు ఉంటున్నాయని నేతలు ఖండించారు. వాటికి ఆర్థిక సాయం అందించే నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపాలని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించబోమని నేతలు ప్రతిన బూనారు.

* బ్రిక్స్‌లోకి కొత్త దేశాలను చేర్చుకునే అంశంపై పూర్తి సంప్రదింపులు, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తామని, కూటమి సంస్థాగత అభివృద్ధిపై నిరంతర కృషి జరుగుతుందని నేతలు డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని