మహా దార్శనికుడు అంబేడ్కర్‌

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే ఎలాంటి కుటుంబ నేపథ్యం లేని తన లాంటి వాళ్లు ఉన్నత స్థానాలకు చేరగలుగుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా

Published : 25 Jun 2022 03:22 IST

ఆయన రాజ్యాంగ రచన వల్లే నాలాంటి వారికి ఈ స్థానం
కొలంబియా విశ్వవిద్యాలయంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, దిల్లీ: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే ఎలాంటి కుటుంబ నేపథ్యం లేని తన లాంటి వాళ్లు ఉన్నత స్థానాలకు చేరగలుగుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌ నగరంలోని కొలంబియా యూనివర్సిటీని సందర్శించి అక్కడి పూర్వ విద్యార్థి అయిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ రచన ద్వారా ప్రజాస్వామానికి, భారతదేశానికి అంబేడ్కర్‌ చేసిన సేవలను కొనియాడారు. ‘‘గొప్ప అభ్యాస పీఠమైన కొలంబియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఎన్నో ఏళ్ల క్రితం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ నడయాడారు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో నడవడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా జీవితంలో ఎంతో ఉద్వేగభరితమైన క్షణం. నేను ఓ సాధారణ రైతు కుమారుడిని. కుటుంబంలో విశ్వవిద్యాలయ స్థాయి విద్యను అందుకున్న తొలి వ్యక్తిని. అయినప్పటికీ అంబేడ్కర్‌ నేతృత్వంలో రూపొందించిన ప్రగతిశీల, దార్శనికతతో కూడిన రాజ్యాంగం కారణంగానే భారత ప్రధాన న్యాయమూర్తిగా ఇక్కడ నిలబడగలిగాను. నాతోపాటు, నాలాంటి కోట్ల మంది ఎప్పటికీ ఆ దార్శనికుడికి రుణపడి ఉంటారు. అంబేడ్కర్‌తో సహా ఎంతో మంది ప్రపంచ స్థాయి నాయకులను తయారు చేసిన విద్యా సంస్థలో ఈ రోజు నిలబడటాన్ని గర్వంగా భావిస్తున్నాను. ఆధునిక భారత నిర్మాతల్లో బాబా సాహెబ్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఒకరు. ఆయన జీవితం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది. నా దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం అన్నది ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం. విద్యార్థులు, యువత ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తించడం అత్యవసరం. మన క్రియాశీలక భాగస్వామ్యంతో మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ప్రపంచంలో సుస్థిర శాశ్వత శాంతిస్థాపనకు ప్రజాస్వామ్య విధానం ఒక్కటే మార్గం’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని