Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్‌

గుజరాత్‌ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్‌ వేసిన జాకియా జాఫ్రీకి న్యాయసాయం అందించిన సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను రాష్ట్రానికి చెందిన ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్‌లో నమోదైన

Updated : 26 Jun 2022 11:05 IST

మాజీ డీజీపీ అరెస్టు

గుజరాత్‌ ఏటీఎస్‌ చర్య

మోదీకి సుప్రీంలో క్లీన్‌చిట్‌ వచ్చిన మరుసటి రోజే కీలక పరిణామం

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్‌ వేసిన జాకియా జాఫ్రీకి న్యాయసాయం అందించిన సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను రాష్ట్రానికి చెందిన ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్‌లో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఆమెను ముంబయిలో నిర్బంధించారు. అనంతరం అహ్మదాబాద్‌కు తరలించారు. గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌నూ అరెస్టు చేశారు. అమాయకులను కేసులో ఇరికించేందుకు కుట్రపన్నారంటూ వీరిపై అభియోగాలు నమోదయ్యాయి. మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీతల్వాడ్‌, శ్రీకుమార్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇందులో మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌ను కూడా నిందితుడిగా పేర్కొన్నారు. అయితే వేరే కేసులో ఆయన జైల్లో ఉన్నారు. శనివారం ముంబయి జుహు ప్రాంతంలోని సీతల్వాడ్‌ నివాసానికి వచ్చిన గుజరాత్‌ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు తెలియజేయడం కోసం సమీపంలోని శాంటాక్రూజ్‌ ఠాణాకు తరలించారు. ఈ కేసుపై గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని సీతల్వాడ్‌ తరఫు న్యాయవాది విజయ్‌ ఆరోపించారు. ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, ఆమెపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీన్ని గుజరాత్‌ పోలీసులు ఖండించారు. అహ్మదాబాద్‌కు తరలించాక సీతల్వాడ్‌ను లాంఛనంగా అరెస్టు చేస్తామని తెలిపారు. తన అరెస్టు అక్రమమని ఆమె పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ మేరకు శాంటాక్రూజ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్‌ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్‌ ఎంపీ ఎహ్‌సాన్‌ జాఫ్రీ సహా 68 మంది మరణించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్‌ తేల్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఎహ్‌సాన్‌ భార్య జాకియా జాఫ్రీ పలు కోర్టులను ఆశ్రయించారు. మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ జాఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. అనంతరం మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ సీతల్వాడ్‌తో కలిసి న్యాయస్థానాలను జాకియా ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని