జర్నలిస్టు మొహమ్మద్‌ జుబైర్‌ అరెస్టు

ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్‌ జుబైర్‌ను దిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఓ ట్వీట్‌ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

Published : 28 Jun 2022 04:32 IST

మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలే కారణం

దిల్లీ: ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్‌ జుబైర్‌ను దిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఓ ట్వీట్‌ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ట్విటర్‌ వినియోగదారుడొకరు చేసిన ఫిర్యాదు మేరకు జుబైర్‌పై భారత శిక్షాస్మృతిలోని 153ఎ (మతం, జాతి, జన్మస్థలం, భాష వంటివాటి ఆధారంగా రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం), 295ఎ (ఉద్దేశపూర్వక దుశ్చర్య ద్వారా మతపరమైన భావాలను దెబ్బతీయడం) సెక్షన్ల కింద ఇటీవల కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని ఆల్ట్‌ న్యూస్‌ మరో సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ సిన్హా ఆరోపించారు. జుబైర్‌ అరెస్టును కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. భాజపా ద్వేషం, మత దురభిమానం, అబద్ధాలను బయటపెట్టేవారందరినీ ఆ పార్టీ శత్రువులుగానే చూస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. సత్యం చెప్పే ఒక్క గొంతును అరెస్టు చేస్తే.. అలాంటి మరో వెయ్యి గొంతుకలు పుట్టుకొస్తాయని పేర్కొన్నారు. నియంతృత్వంపై ఎప్పుడూ సత్యానిదే గెలుపని వ్యాఖ్యానించారు. జుబైర్‌ జిహాదీ అని, హింసను రెచ్చగొట్టారని భాజపా ప్రధాన కార్యదర్శి సి.టి.రవి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని