పర్వత ప్రాంతాల్లో మొక్కల కోసం హీటింగ్‌ వ్యవస్థ

పర్వత ప్రాంతాల్లో మొక్కలకు ప్రయోజనం కల్పించే వినూత్న వ్యవస్థను కాన్పుర్‌ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మొక్కల వేర్లను వేడి చేయడానికి సౌరశక్తి సాయంతో పనిచేసే హీటింగ్‌ వ్యవస్థను రూపొందించారు. లద్దాఖ్‌ వంటి చోట్ల తాజా

Published : 28 Jun 2022 04:32 IST

దిల్లీ: పర్వత ప్రాంతాల్లో మొక్కలకు ప్రయోజనం కల్పించే వినూత్న వ్యవస్థను కాన్పుర్‌ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మొక్కల వేర్లను వేడి చేయడానికి సౌరశక్తి సాయంతో పనిచేసే హీటింగ్‌ వ్యవస్థను రూపొందించారు. లద్దాఖ్‌ వంటి చోట్ల తాజా కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తుల కొరతను తీర్చడానికి ఇది దోహదపడుతుంది. ఈ టెక్నాలజీకి పేటెంట్‌ కూడా మంజూరైంది. సేంద్రియ వ్యర్థాల సమర్థ నిర్వహణకు మరో వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

ఎత్తయిన ప్రాంతాల్లో తాజా కూరగాయల లభ్యత, సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా సైనిక దళాలకు ఈ సమస్య చాలా ఎక్కువ. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా తాజా కూరగాయలు, పండ్లను పొందడం అసాధ్యం. దీన్ని అధిగమించడానికి కాన్పుర్‌ ఐఐటీ పరిశోధకులు నడుంబిగించారు. ఇందులో భాగంగా పాలీహౌస్‌లో కూరగాయల మొక్కలను నాటారు. నేల లోపల.. మొక్కల వేర్ల వద్ద జీఐ గొట్టాలను ఏర్పాటు చేశారు. సౌరశక్తి సాయంతో వేడిచేసిన నీటిని ఈ పైపుల గుండా పంపారు. ఫలితంగా నేల వేడెక్కింది. ఈ వ్యవస్థ వల్ల పుడమి ఉష్ణోగ్రత 7-18 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫలితంగా మొక్కలు వేగంగా, ఆరోగ్యంగా పెరిగాయని వివరించారు. ఉష్ణోగ్రతలు మైనస్‌ 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే ప్రాంతాలనూ దృష్టిలో పెట్టుకొని దీన్ని అభివృద్ధి చేశామన్నారు.

అలాగే పాలీహౌస్‌లోని వెర్మీ కంపోస్టింగ్‌ ద్వారా సేంద్రియ వ్యర్థాల నిర్వహణను శాస్త్రవేత్తలు చేపట్టారు. నేలలో రబ్బర్‌ పైపులు ఏర్పాటు చేసి, వాటి ద్వారా వేడినీటిని సరఫరా చేస్తూ వెర్మీ బెడ్‌కు అదనపు ఉష్ణాన్ని అందించారు. ఈ రెండు వ్యవస్థల ద్వారా.. శీతాకాలాల్లో ఎత్తయిన ప్రాంతాల్లో తాజా ఆహారాన్ని అందించడంతోపాటు శూన్య వ్యర్థాల సాధనకు పరిష్కార మార్గాన్ని  చూపొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని