Published : 30 Jun 2022 05:21 IST

హత్య వెనుక పాక్‌ హస్తం!

ఆ దేశ సంస్థతో గౌస్‌ మహ్మద్‌కు సంబంధాలు

కరాచీలో ఉగ్ర శిక్షణ పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారణ

ఉదయ్‌పుర్‌లో కన్హయ్య అంత్యక్రియలు పూర్తి

ఉదయ్‌పుర్‌, దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పుర్‌ హత్య కేసులో పాకిస్థాన్‌ శక్తుల హస్తం ఉన్నట్లు కనిపిస్తోంది! దర్జీ కన్హయ్య లాల్‌ను మంగళవారం అత్యంత కిరాతకంగా నరికి చంపినవారిలో ఒకరైన గౌస్‌ మహ్మద్‌కు పాక్‌లోని ఓ సంస్థతో సంబంధాలున్నాయని.. అతడు గతంలో ఆ దేశానికి వెళ్లి ఉగ్ర శిక్షణ కూడా పొందాడని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని పూర్తిగా నిగ్గు తేల్చేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. మరోవైపు- అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఉదయ్‌పుర్‌లో కన్హయ్య అంత్యక్రియలు బుధవారం ముగిశాయి. అంతిమ యాత్ర సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు సత్వరం స్పందించి పరిస్థితులను అదుపు చేశారు. ఘర్షణలు చెలరేగకుండా నివారించేందుకుగాను ఉదయ్‌పుర్‌లో 7 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూను కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్విగ్న వాతావరణం ఉండటంతో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. కన్హయ్య హత్యను దేశవ్యాప్తంగా పలు ముస్లిం సంస్థలు ముక్తకంఠంతో ఖండించాయి.

భయాందోళనలు సృష్టించేందుకే..

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ- ఐఎస్‌ఐఎస్‌ వల్ల ప్రభావితమైన వ్యక్తులే కన్హయ్యను హత్య చేసినట్లు తొలుత అనుమానాలు వెలువడిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సత్వరం స్పందించింది. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఎన్‌ఐఏను ఆదేశించింది. దీంతో మంగళవారమే ఉదయ్‌పుర్‌ చేరుకున్న ఆ సంస్థ బృందం.. బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. దేశ ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలన్న లక్ష్యంతోనే హంతకులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కూడా అదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కన్హయ్య హత్య కేసు నిందితులకు విదేశీ శక్తులతో సంబంధాలున్నట్లు తెలిసిందని చెప్పారు.

కన్హయ్య హంతకుల్లో ఒకరైన గౌస్‌ మహ్మద్‌కు పాకిస్థాన్‌లోని ఇస్లామిక్‌ సంస్థ దావత్‌-ఎ-ఇస్లామీతో సంబంధాలున్నాయని డీజీపీ లాఠర్‌ తెలిపారు. ముంబయి, దిల్లీల్లోనూ ఆ సంస్థకు కార్యాలయాలున్నాయని చెప్పారు. 2014లో గౌస్‌ కరాచీ వెళ్లొచ్చాడని పేర్కొన్నారు. హత్య కేసులో రియాజ్‌, గౌస్‌లతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కరాచీలో గౌస్‌ 45 రోజులపాటు ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు హోంమంత్రి రాజేంద్ర యాదవ్‌ తెలిపారు. 2018-19లో గౌస్‌ అరబ్‌ దేశాలకు వెళ్లాడని, గతేడాది నేపాల్‌లో ఉన్నాడని పేర్కొన్నారు.

రక్షణ కోరినా.. పట్టించుకోని పోలీసులు

హత్యకు సంబంధించిన పలు కీలక వివరాలను డీజీపీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. సామాజిక మాధ్యమాల్లో కన్హయ్య పెట్టిన పోస్టు ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉండటంతో ఆయనపై ఈ నెల 10న కేసు నమోదైంది. 11న ఆయన అరెస్టయ్యారు. మరుసటిరోజే బెయిలుపై విడుదలయ్యారు. అప్పటి నుంచి కన్హయ్యకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. నలుగురైదుగురు వ్యక్తులు తన దుకాణం వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని, తన ప్రాణాలకు ముప్పుందని 15న పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవడంలో స్థానిక పోలీసు అధికారులు విఫలమయ్యారు. కన్హయ్య ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. ఇరువర్గాలను పిలిపించి  సామరస్యంగా ఉండాలని హితవు పలికి పంపించారు. తర్వాత పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను ఎస్‌హెచ్‌వోతోపాటు సహాయ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేసినట్లు డీజీపీ తెలిపారు.

అంతిమయాత్రలో ఉద్రిక్తతలు

కన్హయ్య మృతదేహానికి బుధవారం శవపరీక్ష నిర్వహించారు. ఆయన ఒంటిపై మొత్తం 26 గాయాలున్నట్లు తేలింది. పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య అశోక్‌నగర్‌ శ్మశానవాటికలో కన్హయ్య అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు ఉదయ్‌పుర్‌ సెక్టార్‌ 14లోని ఆయన ఇంటి నుంచి అశోక్‌నగర్‌ వరకు అంతిమయాత్ర సాగింది.  అశోక్‌నగర్‌లో ఓ వర్గానికి చెందిన శ్మశానవాటిక గేటును ధ్వంసం చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. రాళ్లు కూడా రువ్వారు. పోలీసులు వారిని నియంత్రించారు. మరోవైపు- కన్హయ్య హత్యకు నిరసనగా రాజ్‌సమంద్‌ జిల్లాలోని భీమ్‌ పట్టణంలో నిర్వహించిన ప్రదర్శనలో ఉద్రిక్తతలు తలెత్తాయి. కొంతమంది రాళ్లు రువ్వుతూ ఓ మసీదు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. బాష్పవాయువు ప్రయోగంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ గందరగోళంలో ఓ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి జరిగింది.

20 ఏళ్లకుపైగా దుబాయ్‌లోనే..

కన్హయ్య హత్య కేసు ప్రధాన నిందితుల్లో ఒకడైన రియాజ్‌ అఖ్తారీ రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా అసింద్‌ పట్టణవాసి. 2001లో పెళ్లి చేసుకున్నాడు. మరుసటి ఏడాది దుబాయ్‌కి వలస వెళ్లి.. రెండు దశాబ్దాలకు పైగా అక్కడే ఉన్నాడు. గత ఏడాది తన తండ్రి చనిపోయినా.. అంత్యక్రియలకు కూడా రాలేదు. తర్వాత అతడు భారత్‌కు ఎప్పుడు తిరిగొచ్చాడన్నదానిపై స్పష్టత లేదు. ఈ నెల 12నే తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అసింద్‌ నుంచి ఉదయ్‌పుర్‌కి మకాం మార్చాడు. వృత్తిరీత్యా అతడు వెల్డర్‌. మత ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనేవాడు.

ఖండించిన పాక్‌

గౌస్‌ మహ్మద్‌కు తమ దేశంలోని సంస్థతో సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలను పాకిస్థాన్‌ ఖండించింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే భారత్‌ ఇలాంటి ప్రచారానికి పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.


కుమారుడి పొరపాటే కారణమా?

సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్టే కన్హయ్య హత్యకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ వివాదాస్పద పోస్టును తాను షేర్‌ చేయలేదని ఈ నెల 15న పోలీసులకు చేసిన ఫిర్యాదులో కన్హయ్య పేర్కొన్నారు. మొబైల్‌ ఫోన్‌లో గేమ్‌ ఆడుతూ తన కుమారుడు అనుకోకుండా ఆ పని చేశాడన్నారు. అసలు ఫోన్‌ ఎలా ఆపరేట్‌ చేయాలో కూడా తనకు తెలియదని వివరించారు. మొత్తం ఆరుగురు వ్యక్తుల పేర్లను ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తాను ఎక్కడ కనిపించినా చంపేయాలంటూ వారు సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గానికి సంబంధించిన గ్రూపుల్లో పోస్టులు పెట్టారని తెలిపారు. ఇటీవల వచ్చిన హెచ్చరికలతో కన్హయ్య భయపడ్డారని.. ఆరు రోజుల పాటు దుకాణం తెరవనేలేదని ఆయన భార్య జశోదా తెలిపారు. దుకాణం తెరిచిన రోజునే ఆయన్ను పొట్టనపెట్టుకున్నారంటూ వాపోయారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని