Updated : 30 Jun 2022 06:22 IST

రూ.2,516 కోట్లతో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ

కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర

దేశవ్యాప్తంగా 63వేల ప్యాక్స్‌కి డిజిటల్‌ సౌకర్యం

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 63వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను (ప్యాక్స్‌) రూ.2,516 కోట్లతో కంప్యూటరీకరించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసింది. ఈ సంస్థల సామర్థ్యం పెంచడంతోపాటు, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనివల్ల ప్యాక్స్‌ తమ వ్యాపార కార్యకలాపాలను విభిన్న రంగాలకు విస్తరించడంతో పాటు, ఏకకాలంలో బహుళ సేవలు అందించడానికి వీలవుతుందని తెలిపింది. వచ్చే అయిదేళ్లలో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇందులో కేంద్రప్రభుత్వ వాటా రూ.1,528 కోట్లు. రైతులకు వ్యవసాయ కార్యకలాపాల కోసం స్వల్పకాల రుణ సౌకర్యం కల్పించే మూడంచెల వ్యవస్థలో ఈ సంఘాలు అట్టడుగున ఉన్నాయి. ఇవి దాదాపు 41% లేదా 3.01 కోట్ల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కింద రుణాలు అందిస్తున్నాయి. వీరిలో 2.95 కోట్ల మంది (95%) చిన్న, సన్నకారు రైతులే. రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను నాబార్డ్‌ ఇప్పటికే కామన్‌ బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆటోమేటెడ్‌ విధానంలోకి తీసుకొచ్చింది. చాలావరకూ ప్యాక్స్‌ ఇప్పటికీ మాన్యువల్‌గానే నడుస్తున్నాయి. దానివల్ల అసమర్థత, అపనమ్మకం పెరిగిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్యాక్స్‌ని కంప్యూటరీకరించినా.. డీసీసీబీ, ఎస్‌సీబీలతో అనుసంధానమయ్యేలా వాటిలో ఏకీకృత సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించలేదు. దానివల్ల కంప్యూటరీకరణ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్ర హోం, సహకారశాఖల మంత్రి అమిత్‌షా వీటన్నింటినీ కంప్యూటరీకరించి జాతీయస్థాయిలో ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి ఉమ్మడి అకౌంటింగ్‌ వ్యవస్థను అమలుచేయాలని నిర్ణయించారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను వేగంగా తీర్చడంతో పాటు ఎరువులు, విత్తనాలను అందించే నోడల్‌ వ్యవస్థలుగా వీటిని ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది. ఇవి బ్యాంకింగ్‌ ఔట్‌లెట్లలా పనిచేయడంతో పాటు, బ్యాంకింగేతర కార్యకలాపాలనూ కొనసాగించడానికి వీలవుతుందని, తక్కువ లావాదేవీ ఖర్చులతో రుణాలు మంజూరు చేయడంతోపాటు, వేగంగా ఆడిట్‌ నిర్వహించడానికి కంప్యూటరీకరణ దోహదం చేస్తుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న రికార్డుల డిజిటలీకరణతో పాటు, కొత్త సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ, శిక్షణ కార్యక్రమాలను ఈ కొత్త విధానంలో అందిస్తారు. దీన్ని స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచుతారు. అవసరాన్ని బట్టి ఏ భాషలోకైనా మార్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో దీనికోసం ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్లు (పీఎంయూ) ఏర్పాటుచేస్తారు. 200 ప్యాక్స్‌ని ఒక క్లస్టర్‌గా గుర్తించి జిల్లాస్థాయిలో అవసరమైన చేయూత అందిస్తారు. రాష్ట్రస్థాయిలో ప్యాక్స్‌ కంప్యూటరీకరణ పూర్తిచేస్తే ఒక్కో సంస్థకు రూ.50వేల చొప్పున రీయింబర్స్‌ చేస్తారు. అయితే ఆ సంస్థలు కామన్‌ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించాలి.

* అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ(ఐఆర్‌ఈఎన్‌ఏ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశం హరిత ఇంధనం వైపు మళ్లడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.

* విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి(సీడీఆర్‌ఐ)ని అంతర్జాతీయ సంస్థగా వర్గీకరించడాన్ని ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి(ప్రివిలేజెస్‌, ఇమ్యునిటీస్‌) చట్టం-1947 కింద మినహాయింపులు, రక్షణ కల్పిస్తూ సీడీఆర్‌ఐతో ఒప్పందం చేసుకుంది. దీనివల్ల ఆ సంస్థ అంతర్జాతీయంగా తన విధులను సమర్థంగా నిర్వహించడానికి అవసరమైన స్వతంత్రత, చట్టబద్ధత లభిస్తాయని పేర్కొంది. సీడీఆర్‌ఏ సభ్య దేశాల మధ్య నిధుల సమీకరణ, పంపిణీ, సాంకేతిక నైపుణ్యాల మార్పిడి సాధ్యమవుతుందని తెలిపింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని