భార్య అవయవదానంపై భర్తకు నిర్ణయాధికారం ఉండదు

ఒక వివాహిత అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం అవసరంలేదని, అలా చేయడం వల్ల ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కును కోల్పోయినట్టే అవుతుందని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 30 Jun 2022 05:21 IST

దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: ఒక వివాహిత అవయవదానం చేయడానికి ఆమె భర్త అంగీకారం అవసరంలేదని, అలా చేయడం వల్ల ఆ మహిళ తన సొంత శరీరంపై హక్కును కోల్పోయినట్టే అవుతుందని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ మహిళ తన రెండు కిడ్నీల్లో ఒకదాన్ని.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి దానం చేసేందుకు ముందుకొచ్చారు. అయితే- ఆమె అవయవదానం చేయడానికి భర్త అంగీకారం అవసరమని, అతడి నుంచి ధ్రువీకరణపత్రం తీసుకురావాలని ఆసుపత్రి వర్గాలు షరతు పెట్టాయి. దీంతో సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించారు. తాను భర్త నుంచి దూరంగా ఉంటున్నానని, తన కిడ్నీ దానం చేయడానికి ఆయన అనుమతి తీసుకోలేనని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా- ‘మానవ అవయవాలు, కణజాల మార్పిడి నిబంధనలు-2014’కు ఆయన అర్థవివరణ చెప్పారు. ‘‘అవయవదానానికి సంబంధించి ఒక వ్యక్తి సొంతంగానే నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో అతడు లేదా ఆమె నిర్ణయాన్ని ఉన్నత స్థాయిలో సమీక్షించి, ఖరారుచేసే హక్కు చట్టపరంగా జీవిత భాగస్వామికి ఉండదు’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని