మణిపుర్‌లో తీవ్ర విషాదం

మణిపుర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో కొండచరియలు విరిగిపడటంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ యార్డు వద్ద

Published : 01 Jul 2022 04:36 IST

కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

ఇంఫాల్‌, ఈనాడు-గువాహటి: మణిపుర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో కొండచరియలు విరిగిపడటంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ యార్డు వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏడుగురు రైలుమార్గ నిర్మాణ పనుల వద్ద భద్రతా విధుల్లో ఉన్న ప్రాదేశిక సైన్యానికి చెందిన జవాన్లు, ఒక పౌరుడు ఉన్నారు. 13 మంది జవాన్లు, అయిదుగురు పౌరులను కాపాడినట్లు సైన్యం తెలిపింది. మరో 43 మంది జవాన్లు సహా 70 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో రైల్వే సామగ్రితోపాటు కార్మికులు, జవాన్ల శిబిరాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

కొండచరియలు అడ్డుగా పడటంతో అక్కడి ఎజెయ్‌ నదీ ప్రవాహం ఆగిపోయింది. దీంతో నీరు పెద్దఎత్తున నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నోనీ జిల్లా అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

బీరెన్‌ సింగ్‌తో మాట్లాడిన మోదీ, అమిత్‌షా

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. సీఎం బీరెన్‌ సింగ్‌కు మోదీ గురువారం ఫోన్‌ చేసి పరిస్థితులను సమీక్షించారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయసహకారాలను అందిస్తామని భరోసానిచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా బీరెన్‌తోపాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని