Published : 03 Jul 2022 07:23 IST

Maharashtra: మహారాష్ట్రలోనూ ఉదయ్‌పుర్‌ తరహా హత్య!

మందుల దుకాణం యజమాని నరికివేత
నుపుర్‌శర్మకు మద్దతుగా పోస్టు పెట్టినందుకే

అమరావతి (మహారాష్ట్ర): ఉదయ్‌పుర్‌ దర్జీ కన్హయ్యలాల్‌ హత్య తరహాలోనే మహారాష్ట్రలోనూ ఓ మందుల దుకాణం యజమాని(కెమిస్ట్‌)ని నరికి చంపివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహమ్మద్‌ ప్రవక్తకు వ్యతిరేకంగా భాజపా బహిష్కృత నేత నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. అమరావతి జిల్లాలో మందుల షాపు నిర్వహిస్తున్న ఉమేశ్‌ ప్రహ్లాద్‌రావు కోల్హే(54) గత నెల 21న రాత్రి పది గంటల సమయంలో తన దుకాణం మూసివేసి ఇంటికి వెళుతుండగా కొందరు మోటార్‌ బైక్‌పై వెంబడించి కత్తులతో దాడిచేసి నరికి చంపేశారు. తొలుత దీన్ని దోపిడీ కేసుగా పోలీసులు భావించారు. 12 రోజుల విచారణ అనంతరం నుపుర్‌శర్మకు మద్దతుగా ఉమేశ్‌ చేసిన పోస్టే హత్యకు కారణమని తేల్చారు. హత్యకు పథక రచన చేసిన ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ ఖాన్‌(35) సహా, ముదస్సిర్‌ అహ్మద్‌ (22), షారుక్‌ పఠాన్‌ (25), అబ్దుల్‌ షేక్‌ తస్లీం (24), షోయబ్‌ఖాన్‌ (22), ఆతిబ్‌ రషీద్‌ (22), యూసుఫ్‌ఖాన్‌ (44)లను అరెస్టుచేశారు. ఉమేశ్‌ను చంపితే రూ.10 వేలు ఇస్తానని, హత్యచేసిన తర్వాత సురక్షితంగా కారులో తరలిస్తానని ఇర్ఫాన్‌.. మిగతా నిందితులకు హామీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. ‘‘మహమ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఉమేశ్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీన్ని ఆయన కొందరు ముస్లింలు ఉన్న గ్రూపులోనూ షేర్‌ చేశారు’’ అని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. 

రియాజ్‌ భాజపా సభ్యుడు: కాంగ్రెస్‌

కన్హయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ అఖ్తారీ భాజపా సభ్యుడు అని కాంగ్రెస్‌ ఆరోపించింది. కమలం పార్టీ నేతలతో అఖ్తారీ దిగిన ఫొటోలను శనివారం కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా విడుదల చేశారు. నిందితుడు భాజపా సభ్యుడు కాబట్టే.. కేంద్రం చాలా వేగంగా దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించిందని ఖేరా ఆరోపించారు. వీటిని భాజపా ఖండించింది.

* కన్హయ్య కుటుంబాన్ని భాజపా నేత కపిల్‌ మిశ్ర పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. కన్హయ్య దుకాణంలో పనిచేస్తూ దాడి సమయంలో గాయాల పాలైన ఈశ్వర్‌కు రూ. 25 లక్షలు అందిస్తామని పేర్కొన్నారు.

నుపుర్‌శర్మపై లుక్‌ అవుట్‌ నోటీసు జారీ

మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌శర్మ వరుసగా నాలుగోసారి కూడా తమ ఎదుట హాజరు కాకపోవడంతో కోల్‌కతా పోలీసులు శనివారం లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts