దార్శనికతతో వేసిన పునాదుల్ని దెబ్బతీయకూడదు

దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో ఉంచుకొని దార్శనికతతో వేసిన పునాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయి.

Updated : 03 Jul 2022 07:07 IST

విజ్ఞత ఉన్న ఏ ప్రభుత్వమూ పురోగతిని అడ్డుకోదు
ప్రతి చర్యనూ కోర్టులు ఆమోదించాలని అధికార పార్టీలు అనుకుంటున్నాయి
రాజ్యాంగానికి మాత్రమే న్యాయవ్యవస్థ జవాబుదారీ
భారతీయ అమెరికన్ల సదస్సులో సీజేఐ
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఉద్ఘాటన

ఈనాడు, దిల్లీ: దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో ఉంచుకొని దార్శనికతతో వేసిన పునాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయి. విజ్ఞత, పరిపక్వత, దేశభక్తి ఉన్న ఏ ప్రభుత్వమూ వృద్ధిని మందగింపజేసి, సొంత భూభాగ పురోగతిని అడ్డుకొనేలా విధానాలను మార్చదు’ అని స్పష్టంచేశారు. శనివారం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ‘భారతీయ అమెరికన్ల సంఘం’ నిర్వహించిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘ప్రభుత్వాలు మారినప్పుడు భారత్‌లో సున్నితత్వం, పరిపక్వత కనిపించకపోవడం దురదృష్టకరం.

భారత్‌లో అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రతి చర్యనూ న్యాయవ్యవస్థ ఆమోదించాలని కోరుకుంటున్నాయి. విపక్షాలు తమ రాజకీయ విధానాలను ప్రోత్సహించేలా కోర్టులు వ్యవహరించాలని ఆశిస్తున్నాయి. న్యాయవ్యవస్థ కేవలం రాజ్యాంగానికే జవాబుదారీగా ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఒక్కో వ్యవస్థకు రాజ్యాంగం నిర్దేశించిన పాత్ర, బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నాం’ అని పేర్కొన్నారు.

బాధ్యతల గురించి అవగాహన పెంచాలి

‘‘మనం విసిరేయాల్సింది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించే వ్యక్తులను తప్పితే రాజ్యాంగాన్ని కాదు. ప్రతి అయిదేళ్లకోసారి పాలకుల పనితీరుపై తీర్పునిచ్చే అధికారాన్ని ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చింది. భారతీయ పౌరులు ఇప్పటివరకూ తమ బాధ్యతను అద్భుతంగా నిర్వహించారు. గ్రామీణ ఓటర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 1950లోనే భారత్‌లో వయోజనులందరికీ ఓటుహక్కు కల్పించారు. ఈ లక్ష్యాన్ని అమెరికా 1960లో చేరుకొంది. రాజ్యాంగాన్ని శిలా శాసనంగా, మార్పులేని పత్రంగా చూడకూడదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలూ మారాలి.

భారతీయుల పాత్ర క్రియాశీలకం

ఆధునిక అమెరికా నిర్మాణంలో భారతీయ సమాజం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. నెమ్మదిగా మొదలైన ప్రయాణంలో మీరు గుర్తింపును పెంచుకోవడంతోపాటు జాతికి ముఖచిత్రంగా మారారు. కఠోర శ్రమ, అంకితభావంతోనే ఇది సాధ్యమైంది. సిలికాన్‌ వ్యాలీలోని 50% బిజినెస్‌ టు బిజినెస్‌ స్టార్టప్‌లను స్థాపించి, నిధులు సమకూర్చి, నిర్వహిస్తున్నది భారతీయులే. ప్రపంచవ్యాప్త భారతీయులకు ఇది స్ఫూర్తిదాయకం.

ఐటీ వృద్ధితోనే మెండైన అవకాశాలు

ఐటీ రంగం గుర్తించదగ్గ స్థాయిలో అవకాశాలను కల్పించడంవల్ల అనేకమంది భారతీయులు అమెరికాలో స్థిరపడగలిగారు. 80వ దశకంలోనే భారత ప్రభుత్వం ఐటీ రంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. అవగాహనలేని కొన్ని వర్గాల నుంచి ప్రతిఘటన ఎదురు కావడం, మౌలిక వసతుల లేమి వంటివి అడ్డంకిగా మారాయి. మనం ఇప్పుడు ప్రపంచంలోని ప్రతిభావంతులతో పోటీపడే స్థాయికి ఎదిగాం.

మహిళలకు సాధికారత కల్పించిన ఐటీ రంగం

అత్యంత నిపుణులైన భారతీయులు విభిన్నరంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారు. ఐటీ విప్లవం ప్రారంభం కాకముందే ఎంతోమంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తాను రుజువు చేసుకున్నారు. ఐటీ విప్లవం వారిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఎంతోమంది మహిళలు రెక్కలు కట్టుకొని ఈ రంగంలో వాలిపోతున్నారు. సాధికారత గల మహిళ కుటుంబం, సమాజ గతిని సకారాత్మంగా మార్చగలదు. గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి.

వినూత్నంగా ఆలోచించే సమయం ఇదే

కొత్త పంథాల గురించి ఆలోచించాల్సిన సమయం ఇదే. ఇప్పుడు మీరే ప్రపంచ ఆర్థికరంగ వృద్ధికి కర్త, కర్మ, క్రియలుగా మారారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వ్యక్తిగా కాకుండా వేలమంది ఉద్యోగులకు నాయకత్వం వహించే నాయకుల్లా ఆలోచించాలి. అలాంటి వినూత్న ఆలోచనలవల్లే సుచిత్ర ఎల్ల, కృష్ణ ఎల్ల ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందగలిగారు. మీరు మీ సౌకర్యాలను, నమ్మకమైన ఆదాయాన్ని వదులుకోమని నేను చెప్పడంలేదు. రిస్క్‌ను ఎదుర్కోవడానికి వెనకడుగు వేయొద్దని మాత్రమే చెబుతున్నా. బలమైన ఆధునిక భారత నిర్మాణం కోసం మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. కొన్ని త్యాగాలు చేయాలి.

అమెరికా సమాజ సమ్మిళితత్వాన్ని చూసి నేర్చుకోండి

వైవిధ్యానికి భారత్‌, అమెరికాలు రెండూ ప్రతీకలే. ఈ విభిన్నతను గౌరవించి, మరింత పరిఢవిల్లేలా చూడాలి. ఈరోజు అమెరికా భిన్నత్వాన్ని గౌరవించడంవల్లే మీరంతా ఇక్కడికొచ్చి గుర్తింపు పొందగలుగుతున్నారు. అమెరికన్‌ సమాజానికున్న ఓర్పు, సహనం, కలుపుకొనిపోయే తత్వం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు ఆకర్షితులు కాగలుగుతున్నారు. విభిన్న నేపథ్యాలనుంచి వచ్చిన ప్రతిభావంతులను గౌరవించడం అన్ని వర్గాల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి ముఖ్యం. సమ్మిళిత సూత్రం విశ్వవ్యాప్తం. దాన్ని భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అందరూ గౌరవించాలి. మనల్ని ఏకం చేసే అంశాలపై దృష్టిసారించాలి తప్పితే విడదీసేవాటిపై కాదు. మనుషులు, సామాజిక బంధాలను దెబ్బతీసే సంకుచిత అంశాలకు అనుమతివ్వకూడదు. కలుపుకొనిపోయే విధానాన్ని అలవరుచుకోకపోతే విపత్తును ఆహ్వానించినట్లే.

నిజాయతీ నాయకులను తయారు చేసుకోవాలి

భారతీయులు వృత్తి నిపుణులను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా పంపుతున్నా దేశీయంగా మాత్రం సరైన నాయకత్వం వహించే యువతరాన్ని తయారు చేసుకోలేకపోతున్నాం. నిజాయతీ, విశాల దృక్పథం, ప్రజా క్షేమం కోసం తాపత్రయపడే గుణం, త్యాగం కలిగిన నాయకులు కావాలి. అలాంటి నాయకులను తయారు చేయాల్సిన బాధ్యత మనమీద ఉంది. మీరు సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లను మరిచిపోవద్దు.

తెలుగువాళ్లు ఈ ఎనిమిది గుర్తుపెట్టుకోవాలి
తెలుగువారికి 8 అంశాలు గుర్తు చేస్తున్నాను.
1) తెలుగులోనే మాట్లాడుకోవాలి.
2) బిడ్డలకు తెలుగు ప్రథమ భాషగా చదువు చెప్పించాలి.
3) ఎదుగుతున్న పిల్లలతో ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలి.
4) తెలుగులో ఉత్తరాలు రాసుకొనే సంప్రదాయాన్ని కొనసాగించాలి.
5) తెలుగులో మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు.
6) శతక సాహిత్య, భాషా చరిత్రను యువతకు చెప్పాలి.
7) పిల్లలు మాట్లాడే తెలుగును హేళన చేయకుండా ప్రోత్సహించండి.
8) భాష లేకపోతే మన చరిత్ర, సంస్కృతి ఉండదు. జాతే అంతరించిపోయే ప్రమాదం ఉందని గుర్తించాలి’’ అని జస్టిస్‌ రమణ చెప్పారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారతీయుల సంఘాలు జస్టిస్‌ రమణ, ఆయన సతీమణి శివమాలను సత్కరించాయి. భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల, భారతీయ అమెరికన్ల సంఘం అధ్యక్షుడు కోమటి జయరాం, భారత కాన్సుల్‌ జనరల్‌ నాగేంద్ర ప్రసాద్‌తోపాటు ప్రవాస తెలుగువారు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని