ఏడాదికి రూ.10 లక్షల విదేశీ నిధులు తీసుకోవచ్చు

విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్‌సీఆర్‌ఏ) సంబంధించి కొన్ని నిబంధనలను తాజాగా కేంద్ర హోంశాఖ సవరించింది. ఈమేరకు భారతీయులెవరైనా అధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండానే విదేశాల్లో ఉంటున్న తమ....

Published : 03 Jul 2022 06:32 IST

ఎవరికీ చెప్పక్కర్లేదు పరిమితిని పెంచిన కేంద్రం

దిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్‌సీఆర్‌ఏ) సంబంధించి కొన్ని నిబంధనలను తాజాగా కేంద్ర హోంశాఖ సవరించింది. ఈమేరకు భారతీయులెవరైనా అధికారులకు ఎలాంటి సమాచారం అందించకుండానే విదేశాల్లో ఉంటున్న తమ సంబంధీకుల నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు వరకూ తీసుకోవచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి రూ. లక్ష వరకు మాత్రమే ఉంది. తాజా నిబంధనల ప్రకారం.. పరిమితిని మించి ఎవరైనా నిధులు పొందితే ఆ విషయాన్ని 90 రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇంతవరకు ఇది 30 రోజులుగా ఉండేది. ఈమేరకు ఎఫ్‌సీఆర్‌ఏ కొత్త నిబంధనలపై కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ముఖ్యాంశాలివి..

* ఎఫ్‌సీఆర్‌ఏ కింద వ్యక్తులు, సంస్థలు లేదా స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు) నిధులు పొందడానికి గాను ముందస్తు అనుమతి లేదా నమోదుకు సంబంధించి కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేయడానికి కాల పరిమితిని 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. ఈ దరఖాస్తులో నిధులు తీసుకోవడానికి ఉపయోగించే బ్యాంకు ఖాతా(ల) గురించి సమాచారం అందించాల్సి ఉంటుంది.
* ఆయా సంస్థలు తమ బ్యాంకు ఖాతా, పేరు, చిరునామా, లక్ష్యాలు, కీలక సభ్యులకు సంబంధించి మార్పులు ఏవైనా ఉంటే తెలియజేయడానికి కాల పరిమితిని కూడా 15 నుంచి 45 రోజులకు పెంచారు.
* సవరించిన నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు విదేశీ విరాళాలను పొందకుండా ప్రభుత్వం నిషేధించింది. అలాగే ప్రతి స్వచ్ఛందసంస్థకు చెందిన సభ్యులంతా ఆధార్‌ నమోదు చేయడం తప్పనిసరి.
* విదేశీ నిధులు పొందిన సంస్థలు వాటిలో 20 శాతానికి మించి పరిపాలన సంబంధిత అవసరాలకు వినియోగించకూడదు. 2020కి ముందు ఈ పరిమితి 50%గా ఉండేది. చట్టం ప్రకారం.. నిధులు పొందే అన్ని స్వచ్ఛంద సంస్థలు ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదై ఉండాలి.
* ఎఫ్‌సీఆర్‌ఏ కింద మరో 5 ఉల్లంఘనలను జరిమానా విధించదగ్గ నేరాలుగా చేరుస్తూ కేంద్ర హోంశాఖ మరో నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఇదివరకు ఇలాంటివి 7 అంశాలు మాత్రమే ఉండగా తాజాగా వాటి సంఖ్య 12కి పెరిగింది. విదేశీ నిధులు పొందడం, బ్యాంకు ఖాతాలు తెరవడం వంటి వివరాలు అధికారులకు తెలియజేయకపోవడం.. వెబ్‌సైట్‌లో సమాచారాన్ని ఉంచకపోవడం.. వంటివి ఇందులోకి వస్తాయి. కాగా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 10,000 నుంచి రూ. లక్ష వరకు లేదా పొందిన విదేశీ నిధుల్లో 5% (ఏది ఎక్కువ మొత్తమైతే అది) చొప్పున జరిమానా విధిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని