సిగ్గుతో తల దించుకుంటున్నా

దేశంలో న్యాయవ్యవస్థ తీరు ఘోరంగా ఉందని, ఇటీవలి ఘటనలకు తాను సిగ్గుతో తలదించుకుంటున్నానని రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. వ్యవస్థల గొంతు నులుముతూ, అసలు సిసలైన అత్యవసర పరిస్థితిని

Published : 04 Jul 2022 05:06 IST

న్యాయవ్యవస్థను కొందరు దిగజారిపోయేలా చేశారు

దేశంలో అసలు సిసలు అత్యవసర పరిస్థితి ఉంది: సిబల్‌

దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ తీరు ఘోరంగా ఉందని, ఇటీవలి ఘటనలకు తాను సిగ్గుతో తలదించుకుంటున్నానని రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు. వ్యవస్థల గొంతు నులుముతూ, అసలు సిసలైన అత్యవసర పరిస్థితిని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సృష్టిస్తోందని మండిపడ్డారు. అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. యూకేలో ఉన్న ఆయన ఫోన్‌ ద్వారా పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ జుబైర్‌ అరెస్టు గురించి ప్రస్తావిస్తూ- న్యాయవ్యవస్థలోని కొందరు సభ్యులు దిగజారిపోయేలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో చట్టబద్ధ పాలనను పట్టపగలే ఉల్లంఘిస్తున్నా న్యాయవ్యవస్థ కళ్లు మూసుకుంటోందని అన్నారు. నాలుగేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్‌ అప్పట్లో ఎలాంటి మత కల్లోలాలకు దారి తీయకపోయినా.. దాని పేరు చెప్పి ఇప్పుడు జుబైర్‌ను అరెస్టు చేయడం, ఆయనకు దిల్లీ కోర్టు బెయిల్‌ నిరాకరించడాన్ని కనీసం ఊహించలేమని సిబల్‌ చెప్పారు. న్యాయమూర్తులు తమ ముందు వాదించని విషయాలపైన, అప్పీలు చేయని అంశాలపైన నిర్ధారణకు వస్తున్నారని, చివరకు అసలు ఏమాత్రం సమర్థించలేని ప్రభుత్వ చర్యలకు సరేనంటున్నారని తెలిపారు.

ఎన్నికల్లో విజయానికి ఆయుధంగా ద్వేషం

మహ్మద్‌ ప్రవక్తపై నుపుర్‌ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. అసహనం, విద్వేషాలు మన జాతీయతత్వంలోకి చొచ్చుకెళ్లడానికి నిదర్శనమని సిబల్‌ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ద్వేషం ఒక ఆయుధంగా మారిందని, ఇది ఇలాగే సమాజాన్ని విడదీస్తుంటే ఉదయ్‌పుర్‌ తరహా ఘటనలు చాలా జరుగుతాయని చెప్పారు. ఎమర్జెన్సీ రోజులతో పోలిస్తే అసలుసిసలు అత్యవసర పరిస్థితి ఇప్పుడే ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని