13 ఏళ్లు.. 17 కంప్యూటర్‌ కోర్సులు

పదమూడు సంవత్సరాలకే పదిహేడు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుని ప్రత్యేకత చాటుతున్నాడు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 9వ తరగతి విద్యార్థి అర్నవ్‌. అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేసే అవకాశం వచ్చినా ఉన్నత

Published : 04 Jul 2022 05:06 IST

 కోవై బాలుడు అర్నవ్‌ ప్రత్యేకత

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: పదమూడు సంవత్సరాలకే పదిహేడు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకుని ప్రత్యేకత చాటుతున్నాడు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 9వ తరగతి విద్యార్థి అర్నవ్‌. అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేసే అవకాశం వచ్చినా ఉన్నత చదువులను దృష్టిలో ఉంచుకుని వదులుకున్నాడు. ఇటీవల కోయంబత్తూరు సీఐటీ కళాశాలలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్‌లో ప్రత్యేక అతిథిగా అర్నవ్‌ ప్రసంగించి ఆకట్టుకున్నాడు. ‘అంతరం లేని ఇంటర్నెట్‌ సేవ’కు సంబంధించి తన రెండు కొత్త ఆవిష్కరణలకు ప్రపంచ స్థాయిలో పేటెంట్‌ తీసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నాడు. కోయంబత్తూరు పుదూర్‌లో నివసిస్తున్న శివరామ్‌, అనూష దంపతులకు కుమారులు అర్నవ్‌, నక్షత్ర ఉన్నారు. వారిలో అర్నవ్‌ సీఎస్‌ అకాడమీ పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. అర్నవ్‌కి చిన్న వయసు నుంచే కంప్యూటర్‌పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీన్ని గమనించిన తండ్రి శిక్షణ ఇప్పించడానికి ఓ సంస్థ వద్దకు తీసుకెళ్లారు. కళాశాల విద్యార్థులకే నేర్పిస్తామని అక్కడి శిక్షకుడు చెప్పడంతో.. రెండు రోజులు శిక్షణ ఇచ్చి చూడమని శివరామ్‌ కోరారు. అందుకు అంగీకరించిన శిక్షకుడు.. తర్వాత అర్నవ్‌ ఆసక్తి, ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం బాలుడు పూర్తిగా శిక్షణ పొంది డిప్లొమా ధ్రువపత్రం పొందాడు. నాలుగు నెలల్లో వెబ్‌ డెవలప్‌మెంట్‌, మూడు నెలల్లో జావా, 24 రోజుల్లో పైథాన్‌ ఇలా 17 కోర్సులను పూర్తి చేశాడు అర్నవ్‌. ఐదో తరగతిలో రెండు కంప్యూటర్‌ డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ధ్రువపత్రం తీసుకున్నాడు. 6వ తరగతి చదువుతున్నప్పుడు కోవై జేసీటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో జరిగిన సెమినార్‌లో పాల్గొని మొదటి బహుమతి పొందాడు. 7వ తరగతి చదువుతున్నప్పుడు పెరుందురై కొంగు ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెమినార్‌లోనూ ప్రథమ స్థానం పొందాడు. కోవై స్కూల్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలో తక్కువ వయసున్న విద్యార్థిగా పేరు పొందాడు. 11 ఏళ్ల వయసులో కోవై రత్నం టెక్నాలజీ పార్కులో ఉన్న మల్టీ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు కొత్త ప్రాజెక్టులను తయారు చేసిచ్చాడు. గూగుల్‌ టెన్సర్‌ఫ్లోలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విషయమై ప్రపంచ స్థాయిలో జరిగిన శిక్షణ తరగతిలో ప్రసంగించాడు. అంతేకాకుండా ఇన్ఫోసిస్‌ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 7వేల మందికిపైగా పాల్గొనగా, అందులో ప్రతిభ చూపిన తొలి ఐదుగురిలో అర్నవ్‌ నిలిచాడు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రశంసలూ అందుకున్నాడు. స్టార్టప్‌ పరిశ్రమలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి అర్నవ్‌ వివరిస్తుండటం మరో విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని