ఆన్‌లైన్‌ వచ్చాక అన్ని లైన్లూ పోయాయి

డిజిటల్‌ సాంకేతికత మన దేశంలో ప్రజల జీవితాలను గణనీయంగా మార్చేసిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, బిల్లుల చెల్లింపులు, పరీక్ష ఫలితాలు, వివిధ రకాల ప్రవేశాలు, బ్యాంకు సేవలు వంటి వాటి నిమిత్తం

Published : 05 Jul 2022 03:49 IST

అవినీతికి గండితో ప్రజాధనం ఆదా అయింది: మోదీ

గాంధీనగర్‌: డిజిటల్‌ సాంకేతికత మన దేశంలో ప్రజల జీవితాలను గణనీయంగా మార్చేసిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, బిల్లుల చెల్లింపులు, పరీక్ష ఫలితాలు, వివిధ రకాల ప్రవేశాలు, బ్యాంకు సేవలు వంటి వాటి నిమిత్తం 8-10 ఏళ్ల క్రితం లైన్లలో (వరసల్లో) నిల్చొనేవాళ్లమని గుర్తుచేశారు. ఆన్‌లైన్‌లోకి వెళ్లడం ద్వారా అలాంటి లైన్లన్నింటికీ మన దేశం చెల్లుచీటీ రాసిందని చెప్పారు. సోమవారం ‘డిజిట్‌ భారత్‌ వారోత్సవాలు-2022’ను గాంధీనగర్‌లో ఆయన ప్రారంభించి ప్రసంగించారు. వేర్వేరు రకాల సేవలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్లో లభ్యమవుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్‌ భారత్‌ కార్యక్రమం ద్వారా.. అవినీతి నుంచి పేద ప్రజలకు ఎంతో ఉపశమనం లభించిందని, అన్ని రంగాల్లో దళారుల పాత్రను తొలగించడానికి దీనిద్వారా ప్రయత్నం జరుగుతోందని మోదీ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23 లక్షల కోట్ల నగదు బదిలీ చేయడం ద్వారా రూ.2.23 లక్షల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. ఆధార్‌తో బయోమెట్రిక్‌ సమాచారం అనుసంధానం వల్ల 500 మంది తప్పిపోయిన పిల్లల్ని వారి కుటుంబాలకు చేర్చగలిగామని చెప్పారు. కొత్త సాంకేతికతను అంది పుచ్చుకోని ఏ దేశం కోసం కాలం ఆగదని చెప్పారు. దేశం నాలుగో తరం పారిశ్రామిక విప్లవాన్ని సాధించడంలో డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా దోహదపడతాయని చెప్పారు. డిజిటల్‌ ఇండియా భాషిణి, డిజిటల్‌ ఇండియా జెనిసిస్‌లను ఆయన ప్రారంభించారు. కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రపంచమంతా మెచ్చుకుంటే మన దేశంలో మాత్రం టీకా ధ్రువపత్రాలపై తన ముఖచిత్రాన్ని ప్రచురించినందుకు ప్రశ్నలు ఎదురయ్యాయని చెప్పారు. యూపీఐ చెల్లింపులను పార్లమెంటులోనూ కొందరు వ్యతిరేకించారని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని