Karnataka: రూ.500తోనూ జీవించడం నాకు తెలుసు: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు

అవినీతిపరులకు కర్ణాటక అవినీతి నియంత్రణ దళం (అనిద) ‘కలెక్షన్‌ సెంటర్‌’గా మారిందని వ్యాఖ్యానించిన తనను బదిలీ చేయిస్తామంటూ కొందరు అధికారులు పరోక్ష బెదిరింపులకు దిగుతున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.పి.సందేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 06 Jul 2022 13:50 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: అవినీతిపరులకు కర్ణాటక అవినీతి నియంత్రణ దళం (అనిద) ‘కలెక్షన్‌ సెంటర్‌’గా మారిందని వ్యాఖ్యానించిన తనను బదిలీ చేయిస్తామంటూ కొందరు అధికారులు పరోక్ష బెదిరింపులకు దిగుతున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.పి.సందేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి బెదిరింపులకు భయపడబోనని స్పష్టం చేశారు. ‘హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క అంగుళం భూమినీ కొనలేదు. ఉద్యోగం పోయినా చింతించను. నేను రైతు కుటుంబానికి చెందినవాడిని. నా తండ్రి నుంచి వంశపారంపర్యంగా వచ్చిన భూమి ఉంది. దాన్ని సాగు చేసుకుని జీవిస్తాను. రూ.500తో జీవించడమూ నాకు తెలుసు.. రూ.5వేలతోనూ జీవనం సాగించగలను. నేను ఏ రాజకీయ పార్టీకీ చెందినవాడిని కాదు. ఏ పార్టీ సిద్ధాంతానికీ కట్టుబడి లేను. రాజ్యాంగానికి మాత్రమే నేను కట్టుబడి ఉంటా’ అని కర్ణాటక న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.పి.సందేశ్‌ సోమవారం ఒక కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తు నివేదికను కోరగా అనిద తరఫు న్యాయవాది పి.ఎన్‌.మన్‌మోహన్‌ నిర్లక్ష్యంగా బదులిచ్చారని చెప్పారు. జిల్లా అధికారి కార్యాలయంలో లంచం తీసుకున్న కేసులో బి-రిపోర్టు దాఖలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ‘మీరు ప్రజలను రక్షిస్తున్నారా? లేక అవినీతిపరులకు మద్ధతు ఇస్తున్నారా? అవినీతిపరులకు వ్యతిరేకంగా సెర్చ్‌ వారెంటు జారీ చేసి, ఆ తర్వాత కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా బి-రిపోర్టు ఎలా దాఖలు చేస్తారు’ అని అనిద తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. కొన్ని కేసుల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు జోక్యం చేసుకొని, దర్యాప్తును దారి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని