Updated : 07 Jul 2022 06:53 IST

ఉపరాష్ట్రపతి రేసులో నక్వీ?

 రాజ్యసభ పదవీకాలం ముగియడంతో కేంద్రమంత్రి పదవికి రాజీనామా

మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా..

ఈనాడు, దిల్లీ: రాజ్యసభ పదవీకాలం ముగిసిన కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీని భాజపా ఉపరాష్ట్రపతిగా పంపనుందన్న ప్రచారం ఊపందుకొంది. ఈయనతో పాటు మరో కేంద్ర మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ పదవీకాలం కూడా ముగియడంతో బుధవారం వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.  ఇప్పటివరకూ రాజ్యసభలో ఝార్ఖండ్‌ నుంచి భాజపా తరఫున ప్రాతినిధ్యం వహించిన కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి నక్వీ, బిహార్‌ నుంచి జేడీయూ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఉక్కుశాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ల ఎగువసభ పదవీకాలం నేటితో ముగుస్తుంది.

నడ్డాతో నక్వీ భేటీ...

మంత్రి పదవికి రాజీనామా క్రమంలోనే- నక్వీ బుధవారం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఆయన్ను ఉపరాష్ట్రపతిగా పంపుతారన్న ఊహాగానాలకు ఈ పరిణామం మరింత ఊతమిచ్చినట్టంది. భాజపా అధికార ప్రతినిధి హోదాలో నుపుర్‌ శర్మ... మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపడం తెలిసిందే. దీనికితోడు అరబ్‌ దేశాలు అక్కడి భారతీయ దౌత్యవేత్తలను పిలిపించి, ఈ అనుచిత వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ పరిణామంతో- దేశంలోనూ, భాజపాలోనూ అన్నివర్గాల వారికీ తగిన ప్రాధాన్యం లభిస్తోందని ప్రపంచానికి చాటిచెప్పేలా నక్వీని ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదిస్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వాజ్‌పేయీ మంత్రివర్గంలో సహాయమంత్రిగా పనిచేసిన నక్వీ.. ఇప్పటివరకూ రాజ్యసభలో భాజపా ఉపనేతగా కొనసాగుతూ వచ్చారు. ఆయన స్వస్థలం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌. మైనార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ లోక్‌సభ స్థానానికి గతనెల 23న ఉప ఎన్నిక జరిగింది. ఆ సందర్భంగా భాజపా తరఫున నక్వీకి టికెట్‌ ఇస్తారని అంతా ఊహించినా, అది జరగలేదు. దీంతో ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దింపుతారన్న ప్రచారానికి బలం చేకూర్చినట్టయింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై భాజపా పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటారని, ఆ సందర్భంగా ఎవరిని తెరపైకి తీసుకొస్తారన్నది ఎవరికీ తెలియదని కాషాయపార్టీ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ ఊహాగానాలేనని వ్యాఖ్యానించారు. రాజ్యసభను నడిపించడం ఉపరాష్ట్రపతికి కత్తిమీద సాములాంటి పని కాబట్టి.. భాజపా నాయకత్వం ఆ పదవికి ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేస్తుందంటున్నారు.

ముస్లింలకు చోటు లేనట్టే...

రాజ్యసభ పదవీకాలం ముగుస్తున్నా... నక్వీ, ఆర్‌సీపీ సింగ్‌లను భాజపా, జేడీయూ నాయకత్వాలు మళ్లీ ఎగువసభకు పంపలేదు. మంత్రిగా కొనసాగాలంటే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో.. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులిద్దరూ తమ రాజీనామా పత్రాలను ప్రధాని మోదీకి అందజేశారు. ఈ సందర్భంగా వారి సేవలను ప్రధాని కొనియాడారు. నక్వీ రాజీనామాతో కేంద్ర కేబినెట్‌, భాజపా పార్లమెంటు సభ్యుల బృందంలో ముస్లిం వర్గానికి చెందినవారు ఒక్కరు కూడా లేనట్టయింది. మంత్రుల రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌... మైనార్టీ వ్యవహారాలశాఖ బాధ్యతలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి, ఉక్కుశాఖ బాధ్యతలను మరో మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు అదనంగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని