Published : 07 Jul 2022 03:59 IST

పరారీలో యాంకర్‌ రోహిత్‌ రంజన్‌

 ఆయన కోసం మా పోలీసులు గాలిస్తున్నారు

రాహుల్‌గాంధీపై తప్పుడు వీడియో వ్యవహారంలో రాయ్‌పుర్‌ సీనియర్‌ ఎస్పీ వెల్లడి

రాయ్‌పుర్‌: రాహుల్‌గాంధీపై తప్పుడు వీడియో వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ కేసులో నిందితుడైన టీవీ యాంకర్‌ రోహిత్‌ రంజన్‌ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని రాయ్‌పుర్‌ సీనియర్‌ ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ బుధవారం వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ గాజియాబాద్‌లోని ఇందిరాపురంలో మంగళవారం ఉదయం రంజన్‌ ఇంటికి వెళ్లిన ఛత్తీస్‌గఢ్‌ పోలీసు బృందాన్ని నొయిడా పోలీసులు అడ్డుకుని, నిందితుడిని తమతో పాటు తీసుకెళ్లారు. రంజన్‌ను తాము అరెస్టుచేసి, బెయిల్‌పై విడుదల చేసినట్టు రాత్రి పొద్దుపోయిన తర్వాత వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో తమ పోలీసులు బుధవారం ఉదయం మరోమారు రంజన్‌ ఇంటికి వెళ్లగా, ఆయన అక్కడ లేడని ప్రశాంత్‌ అగర్వాల్‌ తెలిపారు. నొయిడా పోలీసులను అడిగినా, వారు రంజన్‌ గురించి తమ బృందానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. కాగా, పరారీలో ఉన్న రంజన్‌ ఇంటి వద్ద నోటీసు అతికించడంతో పాటు... తప్పుడు వీడియో ప్రసారానికి సంబంధించి టీవీ ఛానెల్‌ అధికారులకు సమన్లు జారీచేసినట్టు రాయ్‌పుర్‌ పోలీసులు వెల్లడించారు. వాంగ్మూలం నమోదు నిమిత్తం ఈనెల 12న రాయ్‌పుర్‌కు వచ్చి తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

వివాదం ఎందుకంటే...

కేరళలోని వయనాడ్‌లో తన కార్యాలయంపై దాడి చేసినవారిని చిన్నపిల్లలుగా పేర్కొంటూ, వారికి వ్యతిరేకంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని రాహుల్‌గాంధీ ఇటీవల వీడియో సందేశమిచ్చారు. ఓ టీవీ ఛానల్‌ ఈ వీడియోను వక్రీకరించి.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన టైలర్‌ కన్హయ్యలాల్‌ హంతకులను ఉద్దేశించి రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. పొరపాటు జరిగిందంటూ ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. అయితే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్‌ ఫిర్యాదు మేరకు ఆ టీవీ ఛానల్‌ యాజమాన్యంతో పాటు యాంకర్‌ రోహిత్‌ రంజన్‌పైనా రాయ్‌పుర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్‌పై తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టినందుకు భాజపాకు చెందిన ముగ్గురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం అయిదుగురిపై ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

రక్షణ కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన రోహిత్‌ రంజన్‌

రాహుల్‌గాంధీపై తప్పుడు వీడియోను ప్రసారం చేసిన కేసుల్లో తనపై బలవంతంగా చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలంటూ... యాంకర్‌ రోహిత్‌ రంజన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జేకే మహేశ్వరిల ధర్మాసనం బుధవారం పరిశీలించింది. గురువారం దీనిపై విచారణ చేపడతామని తెలిపింది.


ఎన్‌బీడీఎస్‌ఏకు కాంగ్రెస్‌ ఫిర్యాదు

రాహుల్‌గాంధీపై తప్పుడు వీడియోను ప్రసారం చేసిన టీవీ ఛానెల్‌పై సత్వరమే చర్యలు తీసుకోవాలంటూ న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ డిజిటల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీడీఎస్‌ఏ)కి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడికి కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతి పవన్‌ ఖెడా లేఖ రాశారు. సదరు ఛానెల్‌ అనైతికంగా, చట్టవిరుద్ధంగా, హానికరంగా రాహుల్‌గాంధీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని అందులో పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని