Updated : 07 Jul 2022 09:02 IST

గూండాలకు భయపడను.. దమ్ముంటే చర్యలు తీసుకోండి

 భాజపాకు ఎంపీ మహువా మొయిత్ర సవాల్‌

ఆమెను అరెస్టు చేయాలంటూ సువేందు అధికారి డిమాండ్‌

పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తృణమూల్‌కు సూచన

కాళీపై వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం

  భాజపాకు ఎంపీ మహువా మొయిత్ర సవాల్‌

దిల్లీ, కోల్‌కతా: కాళీని మాంసాహారిగా, మద్యం స్వీకరించే దేవతగా తాను నమ్ముతున్నానంటూ... తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్ర చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన మొయిత్రను అరెస్ట్‌ చేయాలని పశ్చిమ బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, ఆ పార్టీకి చెందిన విపక్ష నేత సువేందు అధికారి డిమాండ్‌ చేశారు. పది రోజుల్లో చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఎంపీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తృణమూల్‌కు సూచించారు. ఈ క్రమంలోనే భాజపా కార్యకర్తలు పెద్దసంఖ్యలో బౌబజార్‌ ఠాణా వద్దకు చేరుకుని, మొయిత్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజా పరిణామాల క్రమంలో, మహువా మొయిత్ర ఘాటుగా స్పందించారు. ‘‘నేను కాళీమాత భక్తురాలిని. గూండాలకు, వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలని భాజపాకు సవాలు విసురుతున్నా. నా వెనుక సత్యం ఉంది. సత్యానికి బ్యాకప్‌ శక్తులు అవసరం లేదు’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, తృణమూల్‌ ఎంపీపై భోపాల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


‘కాళీ పోస్టర్‌’పై స్పందించి...

దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజాచిత్రం ‘కాళీ’కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కాళీ పాత్రధారి స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన జెండాను చేతబూని, సిగరెట్‌ కాల్చుతూ ఉన్న దృశ్యం ఆ పోస్టర్‌లో ఉంచారు. మంగళవారం ఓ చర్చా కార్యక్రమంలో దీనిపై మొయిత్ర చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి దారితీశాయి. తాను ఏ చిత్రానికీ, ఏ పోస్టర్‌కూ మద్దతు ఇవ్వలేదని, ధూమపానం అనే పదాన్ని అసలు వాడనేలేదని వివరణ ఇచ్చారు. పార్లమెంటులోనైనా, సామాజిక మాధ్యమాల్లోనైనా మహువా మొయిత్ర తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెబుతుంటారు.

తృణమూల్‌కు గుడ్‌బై?

కాళీపై మొయిత్ర వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ మంగళవారం విస్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక ట్విటర్‌ ఖాతాను ఆమె బుధవారం అన్‌ఫాలో చేశారు! తాజా పరిణామాలను చూస్తుంటే మొయిత్ర త్వరలోనే తృణమూల్‌ను వీడవచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విటర్‌ ఖాతాను మాత్రం ఆమె అనుసరిస్తున్నారు. దీంతో పార్టీకి రాజీనామా చేసేంత వరకూ పరిస్థితి వెళ్తుందా? తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది.

మణిమేగలై ట్వీట్ల తొలగింపు

వివాదానికి కేంద్ర బిందువుగా మారిన కాళీ పోస్టర్‌ను ట్విటర్‌ తొలగించింది. ఆ చిత్రంపై దర్శకురాలు లీనా మణిమేగలై చేసిన ట్వీట్లనూ తీసేసింది. కాగా, తృణమూల్‌ ఎంపీపై భాజపా నేతలు విరుచుకుపడటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ పేర్కొన్నారు. ‘‘దేశంలో ఒక్కో ప్రాంతం వారు ఒక్కోలా కాళీమాతను పూజిస్తారు. వారి ఆరాధన పద్ధతులు అందరికీ తెలిసిందే. మతం అనేది వ్యక్తిగత విషయం కాబట్టి, ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరుతున్నా. మహువా మొయిత్ర ఎవర్నీ కించపరిచేందుకు ప్రయత్నించలేదు’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.


మణిమేగలై తల నరికేస్తా
 అయోధ్య పూజారి బెదిరింపులు

ఈనాడు, లఖ్‌నవూ, అయోధ్య: కాళీని అభ్యంతరకరంగా చిత్రీకరించిన దర్శకురాలు లీనా మణిమేగలై తలను నరికేస్తానంటూ అయోధ్యలోని హనుమాన్‌గఢి ఆలయ పూజారి మహంత్‌ రాజుదాస్‌ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘ఈ సినిమా విడుదలైతే పరిస్థితులు అదుపు తప్పుతాయి. మణిమేగలై... తన శరీరం నుంచి తల వేరు కావాలనుకుంటోందేమో’’ అని పేర్కొన్నారు. మణిమేగలైపై చర్యలు తీసుకోవాలని, కాళీ చిత్ర ప్రదర్శనను నిషేధించాలని కేంద్ర హోంశాఖను కోరారు. నిషేధం విధించకపోతే దేశవ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగుతుందని ఆయన హెచ్చరించారు. రాజుదాస్‌ బెదిరింపులకు సంబంధించిన వీడియో తమకు అందిందని, దీనిపై దర్యాప్తు చేపడుతున్నామని అయోధ్య సీనియర్‌ ఎస్పీ ప్రశాంత్‌ వర్మ తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని