Azadi Ka Amrit Mahotsav: ఆకలి తీర్చాడని.. ఉరి తీశారు!
ఆంగ్లేయుల హయాంలో వారి తరవాత ప్రజలపై అంతటి ఆధిపత్యం చలాయించింది జమీందార్లే! కానీ.. ఆ జమీందారు మాత్రం అందుకు విరుద్ధం. ఆకలితో అలమటిస్తున్న దీనులకు ఆహార ధాన్యాలను అందించి అండగా నిలిచారు.
ఆంగ్లేయుల హయాంలో వారి తరవాత ప్రజలపై అంతటి ఆధిపత్యం చలాయించింది జమీందార్లే! కానీ.. ఆ జమీందారు మాత్రం అందుకు విరుద్ధం. ఆకలితో అలమటిస్తున్న దీనులకు ఆహార ధాన్యాలను అందించి అండగా నిలిచారు. అందుకు ప్రతిఫలంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు అందించిన నజరానా... ఉరి!!
వీర్ నారాయణ్ సింగ్.. ఛత్తీస్‌గఢ్‌లోని సోనాఖాన్‌లో 1795లో జమీందారీ కుటుంబంలో జన్మించారు. తండ్రి మరణించాక నారాయణ్ సింగ్ 1830లో ఆ ప్రాంత ప్రజలకు జమీందారుగా మారారు. ఆ భావన ఏకోశానా రానీయకుండా ఎప్పుడూ ప్రజల వద్దకే వెళ్తూ... వారి మధ్యనే ఉంటూ... సమస్యలను పరిష్కరిస్తుండేవారు. ఈ క్రమంలో 1856లో భీకర కరవు ఏర్పడింది. వర్షాలు లేక సోనాఖాన్ ప్రాంత రైతులు పంటలు సాగు చేయలేకపోయారు. ఆహార ధాన్యాలు లేక వారు ఆకలితో అల్లాడిపోయారు. ఎంతో మంది చనిపోయారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ బ్రిటిష్ సర్కార్ సహాయ చర్యలు చేపట్టలేదు.
ప్రజల ఆకలి తీర్చడానికి నారాయణ్ సింగ్ తన సొంత ధాన్యాగారాన్ని తెరిచారు. బియ్యం, ఉప్పు, పప్పు... ఒకటేమిటీ అందులో ఉన్నదంతా ప్రజలకు పంచిపెట్టారు. కొన్ని రోజులకే ఆ ధాన్యాగారం ఖాళీ అయింది. దీంతో ఆహార ధాన్యాలను ఇవ్వాలని కన్‌డోల్ ప్రాంతానికి చెందిన జమీందారు మాఖన్ సింగ్‌ను కోరారు. ఆయన ససేమిరా అన్నారు. కనీసం అరువుకైనా ఇవ్వాలని, పంటలు పండాక తిరిగి ఇస్తాననీ వేడుకున్నంత పనిచేశారు నారాయణ్ సింగ్. అయినా మాఖన్ సింగ్ మనసు కరగలేదు. పైగా... బ్రిటిష్ వారికి ఈ సమాచారం చేరవేశాడు. ఆగ్రహోదగ్రుడైన నారాయణ్ సింగ్ ఆంగ్లేయులు వచ్చేలోపే మాఖన్ సింగ్ ధాన్యాగారాన్ని కొల్లగొట్టారు. అందులోని ధాన్యాన్ని అంతా ప్రజలకు పంచిపెట్టారు. తన ధాన్యాగారాన్ని లూటీ చేశాడంటూ మాఖన్ సింగ్ అప్పటి రాయ్‌పుర్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. నారాయణ్ సింగ్‌పై కేసు నమోదు చేసి 1856 అక్టోబరులో జైలుకు పంపారు ఆంగ్లేయ పోలీసులు. కారాగారంలో ఉండగానే ప్రజలు నారాయణ్ సింగ్‌ను తమ ‘రాజు’గా ఎన్నుకున్నారు. ఆయన్ను విడుదల చేయాలంటూ బ్రిటిష్ అధికారులపై ఒత్తిడి పెంచారు. అయినా ఆంగ్లేయులు వినిపించుకోలేదు. జైల్లోని కొందరితో కలిసి సొరంగం తవ్వి నారాయణ్‌సింగ్ తప్పించుకున్నారు.
కారాగారం నుంచి వచ్చిన తరవాత నారాయణ్ సింగ్‌లో స్వాతంత్య్రోద్యమ కాంక్ష బలంగా పెరిగింది. తెల్లవారిని దేశం నుంచి తరిమేస్తేనే భారత ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారన్న భావన దృఢమైంది. సోనాఖాన్‌కు చెందిన 500 మందితో 1857 ఆగస్టులో సాయుధ సైన్యాన్ని తయారు చేసి స్వరాజ్య శంఖారావాన్ని పూరించారు. కొండల్లో, అడవుల్లో అజ్ఞాతంగా ఉంటూ తెల్లదొరలపై, వారి స్థావరాలపై సాయుధ సైనికులతో కలిసి గెరిల్లా యుద్ధం ప్రకటించారు. రోజూ ఎక్కడో చోట దాడులకు పాల్పడుతుండటంతో ఆంగ్లేయ పాలకులకు నిద్ర కరవైంది. దీంతో నారాయణ్ సింగ్ సైన్యాన్ని ఎలాగైనా అణిచివేయాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ సర్కారు స్మిత్ నేతృత్వంలో ఓ ప్రత్యేక సైనిక బృందాన్ని సోనాఖాన్‌కు పంపింది. నారాయణ్ సింగ్, ఆయన సైనికులు ఎక్కడా తగ్గలేదు. సింగ్‌పై కన్నెర్ర చేసిన వలస పాలకులు మరిన్ని కుట్రలకు తెరలేపారు. నారాయణ్ సింగ్ ఆచూకీ తెలపాలని, ఆయన్ను పట్టించాలని సామాన్య ప్రజలను తీవ్రంగా వేధిస్తూ అరాచకాలకు పాల్పడ్డారు. సోనాఖాన్‌లోని ఇళ్లను తగులబెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న నారాయణ్ సింగ్ ప్రజల ఆదరణ పొందుతుండటాన్ని, జనాల్లో తాము చులకన కావడాన్ని ఇతర జమీందార్లు జీర్ణించుకోలేకపోయారు. నారాయణ్ సింగ్‌ను బ్రిటిష్ సైన్యానికి అప్పగించటానికి ఆంగ్లేయులతో చేతులు కలిపారు. మొత్తానికి... జమీందార్లు, బ్రిటిష్ సైనికులు కుట్రపన్ని నారాయణ్ సింగ్‌ను పట్టుకున్నారు. ధాన్యాగారంలోని ధాన్యాన్ని ప్రజలకు పంచినందుకు ఆయనపై రాజద్రోహ నేరం మోపింది ఆంగ్లేయ ప్రభుత్వం. ఆకలితో అల్లాడుతున్న పేదప్రజలకు పట్టెడన్నం పెట్టడమే పాపం అన్నట్టు 1857 డిసెంబరు 10న నారాయణ్ సింగ్‌ను ఉరితీసింది ఆ దయలేని సర్కారు! తమ కోసం వీరమరణం పొందిన జమీందారును ఆ ప్రాంత ప్రజలు ‘వీర్ నారాయణ్ సింగ్’ అని పిలుస్తూ గౌరవించుకుంటున్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక వీర్ నారాయణ్ సింగ్ బలిదానం అయిన చోట ‘జయస్తంభం’ నిర్మించారు. రాయ్‌పుర్‌లో నిర్మించిన అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి ఆయన స్మారకార్థం ‘షాహీద్ వీర్ నారాయణ్ సింగ్’ అని నామకరణం చేశారు కూడా.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!