సెప్టెంబరు 1 నుంచి నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభం కానుంది. నీట్‌-పీజీ 2022 పరీక్ష ఉత్తీర్ణులైన విద్యార్థులు కౌన్సెలింగ్‌ సందర్భంగా ఆల్‌ ఇండియా కోటా సీట్ల కోసం కోర్సు, కళాశాలల

Published : 24 Jul 2022 04:46 IST

దిల్లీ: నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభం కానుంది. నీట్‌-పీజీ 2022 పరీక్ష ఉత్తీర్ణులైన విద్యార్థులు కౌన్సెలింగ్‌ సందర్భంగా ఆల్‌ ఇండియా కోటా సీట్ల కోసం కోర్సు, కళాశాలల ఐచ్ఛికాలను ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లోని 50శాతం ఆల్‌ ఇండియా కోటా, 50శాతం రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధీనంలోని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. ‘‘ఆగస్టు 15 నాటికి వైద్య కళాశాలల తనిఖీ ప్రక్రియను ఎన్‌ఎంసీ పూర్తి చేసి అనుమతి పత్రాలను ఇవ్వనుంది. అందువల్ల సెప్టెంబరు 1 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించాం. దీని వల్ల తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ నాటికే కొత్త సీట్లన్నీ అందుబాటులోకి రానున్నాయి’ అని అధికారులు తెలిపారు. వాస్తవానికి నీట్‌ పీజీ పరీక్ష జనవరిలో, మార్చిలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కొవిడ్‌ కారణంగా గత సంవత్సరం నుంచి ప్రవేశాల ప్రక్రియలో ఆలస్యంగా జరుగుతోంది. ఈ ఏడాది మే 21న పరీక్ష నిర్వహించి.. జూన్‌ 1న ఫలితాలను విడుదల చేశారు. 2021 విద్యా సంవత్సరంలో నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ కౌన్సెలింగ్‌లో 748 సీట్లు మిగిలిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీట్లన్నీ భర్తీ చేయడానికి ఎటువంటి కటాఫ్‌ లేకుండానే స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. నీట్‌-ఎస్‌ఎస్‌ 2021 మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని