CJI: ‘హిజాబ్‌’ పిటిషన్లపై విచారణకు ధర్మాసనం ఏర్పాటుచేస్తాం

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధారణపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ధర్మాసనాన్ని ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు మంగళవారం

Updated : 03 Aug 2022 05:17 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వెల్లడి

దిల్లీ: కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధారణపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ధర్మాసనాన్ని ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. న్యాయమూర్తుల్లో ఒకరు అనారోగ్యంతో ఉన్నందున ఆలస్యం అవుతోందని తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలలో అప్పీళ్లు దాఖలయ్యాయని, ఇప్పటికీ లిస్టింగ్‌కు నోచుకోలేదని కక్షిదారుల్లో ఒకరి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది మీనాక్షీ అరోడా చేసిన ప్రస్తావనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘‘నేను ఓ ధర్మాసనాన్ని ఏర్పాటుచేస్తాను. న్యాయమూర్తుల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేదు’’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ‘‘వేచి ఉండండి. న్యాయమూర్తులకు ఆరోగ్యం కుదుటపడితే కేసు విచారణకు వస్తుంది’’ అని చెప్పారు. హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించేందుకు సుప్రీంకోర్టు జులై 13న అంగీకరించిన సంగతి తెలిసిందే.

‘ఈడీ డైరెక్టర్‌ పదవీకాలం పొడిగింపు’పై కేంద్రం, సీవీసీల స్పందన కోరిన సుప్రీం

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) డైరెక్టర్‌ పదవీకాలాన్ని పొడిగించడం, అలాంటి పొడిగింపులు ఐదేళ్ల వరకు చేపట్టేందుకు వీలుగా చట్టాన్ని సవరించడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై పది రోజుల్లోగా స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)లను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, సీవీసీ, ప్రస్తుత ఈడీ డైరెక్టర్‌ సహా ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని