బెదిరింపుల కేసులో సంజయ్‌ రౌత్‌పై ముంబయి పోలీసుల దర్యాప్తు

తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనున్న ఓ మహిళను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ బెదిరించారనే ఆరోపణతో దాఖలైన కేసులో ముంబయి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ సమర్పించిన ఆడియో క్లిప్‌నకు సంబంధించి ‘2016లో

Published : 03 Aug 2022 06:14 IST

ముంబయి: తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వనున్న ఓ మహిళను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ బెదిరించారనే ఆరోపణతో దాఖలైన కేసులో ముంబయి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళ సమర్పించిన ఆడియో క్లిప్‌నకు సంబంధించి ‘2016లో రికార్డైన అసలు ఆధారం’ కోసం ప్రయత్నిస్తున్నామని, అది తమ చేతికి రాగానే ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపిస్తామని ఓ అధికారి తెలిపారు. ఆమెకు ఫోన్‌ చేసి బెదిరించింది ఎవరో నిర్ధరించుకుంటామన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరించిన పురుషుడి గొంతు ఆ ఆడియో క్లిప్‌లో నమోదై ఉంది. బాధితురాలి ఫిర్యాదును పోలీసులు ఆదివారం నమోదు చేసుకున్నారు. అత్యాచారం, హత్య చేస్తామని టైప్‌ చేసిన పేపర్‌ను గత నెల 15న వార్తాపత్రికలో ఉంచి తమ ఇంటి వద్ద వేశారని ఆ మహిళ ఆరోపించారు. పాత్రాచాల్‌ కుంభకోణంలో అందిన సొమ్ముతో సంజయ్‌ రౌత్‌ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన ఆస్తులకు సాక్షిగా ఉన్న మహిళను బెదిరిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు.. ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండు నివేదికలో వెల్లడించారు. సంజయ్‌ రౌత్‌ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

‘ఎమర్జెన్సీలోనూ ప్రతిపక్షాలకు ఇలాంటి వేధింపులు లేవు’

ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీలోనూ ప్రతిపక్షాలు ఇంతగా వేధింపులకు గురికాలేదని శివసేన అధికార పత్రిక సామ్నా ధ్వజమెత్తింది. తమ పార్టీ ఎంపీ, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ సంజయ్‌ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడంపై ఆ పత్రిక సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. రౌత్‌ భాజపాతో చేతులు కలిపి ఉంటే ఆయనను పరిశుద్ధుడిగా ప్రకటించే వారని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని