బ్యారికేడ్లు ఎక్కి.. ఆంక్షలు ధిక్కరించి

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి. నల్ల దుస్తులు ధరించి పార్లమెంటు లోపల, వెలుపలా ఆ పార్టీ ఎంపీలు, నేతలు ధర్నాలకు దిగారు. దిల్లీలోని ఏఐసీసీ

Published : 06 Aug 2022 04:16 IST

దిల్లీలో ప్రియాంకాగాంధీ రోడ్డుపై బైఠాయింపు
 బలవంతంగా వ్యానులోకి ఎక్కించిన పోలీసులు
రాష్ట్రపతి భవన్‌కు వెళ్తున్న రాహుల్‌, కాంగ్రెస్‌ ఎంపీలూ నిర్బంధం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి. నల్ల దుస్తులు ధరించి పార్లమెంటు లోపల, వెలుపలా ఆ పార్టీ ఎంపీలు, నేతలు ధర్నాలకు దిగారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను  దాటుకుని వెళ్లిన ప్రియాంకా గాంధీ వాద్రా రహదారిపై బైఠాయించారు. నిషేధాజ్ఞలను ధిక్కరించారంటూ ఆమెను మహిళా పోలీసులు బలవంతంగా వ్యానులోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. రాష్ట్రపతి భవన్‌ వైపు ప్రదర్శనగా వెళ్తున్న రాహుల్‌, కాంగ్రెస్‌ ఎంపీలనూ అదుపులోకి తీసుకున్నారు. ఆరు గంటల తర్వాత వారందరినీ విడుదల చేశారు. దిల్లీలో 335 మంది నిరసనకారులను నిర్బంధించామని, వారిలో 65 మంది ఎంపీలున్నారని పోలీసులు తెలిపారు.

అధిక ధరలు, నిరుద్యోగం, జీఎస్టీ రేట్ల పెంపుపై కాంగ్రెస్‌ ఎంపీలు శుక్రవారం  పార్లమెంటులో నిరసనకు దిగారు. సోనియా, రాహుల్‌ సహా వారందరూ నల్ల దుస్తులు, బ్యాడ్జీలు ధరించి ఉభయ సభలకు హాజరయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు వెలుపల ధర్నా నిర్వహించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు ప్రదర్శనగా బయలుదేరారు. ర్యాలీలో సోనియా పాల్గొనలేదు. రాహుల్‌ నాయకత్వంలో వెళ్తున్న ఎంపీలను విజయ్‌ చౌక్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లేందుకు అనుమతించలేదు. రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌, అధీర్‌ రంజన్‌, మనీశ్‌ తివారి సహా అక్కడున్న ఎంపీలు అందరినీ బస్సుల్లో ఎక్కించి తరలించారు. పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని రాహుల్‌ ఆరోపించారు.  మరోవైపున.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి. కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుగా పెట్టిన బ్యారికేడ్లను దాటుకొని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రహదారిపైకి వచ్చారు. రోడ్డుపై బైఠాయించి ధర్నాకు ఉపక్రమించారు. నిషేధాజ్ఞలున్నాయని తెలిపినా ఆమె ఆందోళన విరమించకపోవడంతో మహిళా పోలీసులు చుట్టుముట్టి ప్రియాంకను బలవంతంగా వ్యానులోకి ఎక్కించి  తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని