ఎంపీలేమీ చట్టానికి అతీతులు కారు

చట్టానికి తాము అతీతులమని, తమకు విశేషాధికారాలున్నాయని, కొందరు పార్లమెంటు సభ్యులు అపోహల్లో ఉన్నారని, వాటిని విడనాడాలని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సామాన్య పౌరుడికి వర్తించే చట్టమే, ఎంపీలకూ

Published : 06 Aug 2022 04:16 IST

వారికి విశేషాధికారాలు ఉండవు
సమన్లు జారీ చేస్తే హాజరుకావాల్సిందే
అరెస్టులకూ మినహాయింపులుండవు
రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడి స్పష్టీకరణ

దిల్లీ: చట్టానికి తాము అతీతులమని, తమకు విశేషాధికారాలున్నాయని, కొందరు పార్లమెంటు సభ్యులు అపోహల్లో ఉన్నారని, వాటిని విడనాడాలని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సామాన్య పౌరుడికి వర్తించే చట్టమే, ఎంపీలకూ వర్తిస్తుందని, ఇందులో ప్రత్యేక మినహాయింపులేవీ ఉండవని నొక్కి వక్కాణించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా విపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు ఇచ్చి రప్పించడం అవమానకరమని పేర్కొంటూ శుక్రవారం రాజ్యసభ ప్రారంభం కాగానే పది మంది కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకురావడంతో సభ వాయిదా పడింది. 11.30 గంటలకు తిరిగి సమావేశమైనపుడు వెంకయ్యనాయుడు ఆ అంశంపై వివరంగా మాట్లాడారు. పార్లమెంటు జరుగుతున్న సమయంలో తమపై చర్యలు తీసుకొనే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదన్న భ్రమల్లో చాలా మంది ఎంపీలు ఉంటారని, ఇది తప్పుడు అభిప్రాయమని తెలిపారు. రాజ్యాంగంలోని అధికరణం 105.. ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ విధులను నిర్వర్తించడానికి పార్లమెంటు సభ్యులకు కొన్ని అధికారాలు ఇచ్చిన మాట నిజమేనని, అయితే  అది సివిల్‌ కేసులకే పరిమితమని వెల్లడించారు. సివిల్‌ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీని.. పార్లమెంటు లేదా కమిటీ సమావేశాలు జరిగే 40 రోజులు ముందు లేదా అనంతరం అరెస్టు చేయకూడదని చెప్పారు. ఈ నిబంధననే శిక్ష్మాస్మృతిలోని సెక్షన్‌ 135ఏలోనూ చేర్చారని పేర్కొన్నారు. ‘‘కానీ.. క్రిమినల్‌ వ్యవహారాల్లో సామాన్య పౌరుడు, పార్లమెంటు సభ్యుడు వేర్వేరు కాదు. సెషన్‌ జరుగుతున్నప్పుడు క్రిమినల్‌ కేసుల్లో అరెస్టు నుంచి తప్పించుకొనే మినహాయింపులు ఎంపీలకు లేవు’’ అని వెంకయ్యనాయుడు తెలిపారు. ఇందుకు ఉదాహరణగా.. గతంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని