Updated : 06 Aug 2022 07:19 IST

Vice President: ఉపరాష్ట్రపతులు.. విశేషాలు

సర్వేపల్లి, అన్సారీలకే ఆ ఖ్యాతి..

రెండు సార్లు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన ఖ్యాతి ఇద్దరికే సొంతం. వారే డాక్టర్‌ సర్వేపల్లిరాధాకృష్ణన్‌, హమీద్‌ అన్సారీ. వీరిద్దరి మధ్య మరికొన్ని సారూప్యతలూ ఉన్నాయి. దేశ తొలి ఉప రాష్ట్రపతి అయిన రాధాకృష్ణన్‌ రెండోదఫా కూడా ఆ పదవిలో కొనసాగారు. అలాగే హమీద్‌ అన్సారీ 2007 నుంచి 2017 వరకు రెండు దఫాలు ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. ఈ పదవుల్లోకి రాకముందు ఇద్దరూ భారత రాయబారులుగా కూడా రాణించారు. ఉప కులపతులుగానూ సేవలందించారు. రాధాకృష్ణన్‌ ఆంధ్రా, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాలకు.. అన్సారీ అలీగఢ్‌ ముస్లిం వర్సిటీకి వీసీగా పనిచేశారు.


బి.డి.జట్టి.. బహుగట్టి

సప్ప దానప్ప జట్టి... కర్ణాటకకు చెందిన ఆయన కాంగ్రెస్‌లో కిందిస్థాయి నుంచి ఎదిగారు. 1974లో ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1977 ఫిబ్రవరిలో నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ మృతితో తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 5 నెలలకు పైగా ఈ హోదాలో పనిచేసిన జట్టి హయాం దేశ రాజకీయాల్లో కీలక ఘట్టాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని ఆయన హయాంలోనే ఎత్తివేశారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించగా.. మొరార్జీ దేశాయ్‌ ప్రధాని అయ్యారు. జనతా ప్రభుత్వం ఇదే అదనుగా 9 రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాల రద్దుకు సిఫార్సు చేసింది. దీన్ని జట్టి తిరస్కరించారు. జనతా ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాల రద్దుకు జట్టి అయిష్టంగానే అంగీకరించారు.


మూడు పదవుల్లోనూ.. జస్టిస్‌ హిదాయతుల్లా

తాత్కాలిక రాష్ట్రపతిగా.. ఉప రాష్ట్రపతిగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా పనిచేసిన అరుదైన ఖ్యాతి జస్టిస్‌ ఎం.హిదాయతుల్లాకు దక్కింది. 1968లో ఆయన సీజేఐగా పనిచేశారు. 1969 మేలో నాటి రాష్ట్రపతి జాకిర్‌ హుసేన్‌ ఆకస్మిక మృతితో ఉప రాష్ట్రపతి వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు. అనంతరం రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గిరి రాజీనామా చేయడంతో సీజేఐగా ఉన్న జస్టిస్‌ హిదాయతుల్లా 1969 జులై 20 నుంచి ఆగస్టు 24 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు. సీజేఐగా పదవీ విరమణ చేసిన అనంతరం 1979లో ఉప రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1982 అక్టోబరులో నాటి రాష్ట్రపతి జైల్‌సింగ్‌ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. దీంతో అక్టోబరు 6 నుంచి 31 వరకు మరోసారి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగారు.


వెంకయ్యనాయుడి విశిష్టత

ప రాష్ట్రపతుల్లో ఎం.వెంకయ్యనాయుడిది ఓ ప్రత్యేకత. 1998 నుంచి 2017 వరకు సుదీర్ఘకాలం పెద్దలసభకు ప్రాతినిధ్యం వహించిన విశిష్టత ఆయన సొంతం. ఇంతవరకూ ఏ ఉపరాష్ట్రపతీ ఆయన మాదిరిగా ఎక్కువకాలం రాజ్యసభ సభ్యుడిగా పనిచేయలేదు. హోదారీత్యా ఉప రాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారన్నది తెలిసిందే. అయితే సభా నిర్వహణ ఆషామాషీ కాదు. అధికార, విపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇందుకు సభా నిబంధనలు, సంప్రదాయాలపై పట్టు అవసరం. రాజ్యసభ సభ్యుడిగా విశేషానుభవం ఉన్న వెంకయ్యనాయుడికి వీటిపై సంపూర్ణ అవగాహన ఉంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని