Published : 06 Aug 2022 05:11 IST

కనీస మద్దతుధర పటిష్ఠ అమలుకు కమిటీ

దిల్లీ: రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతుధర (ఎంఎస్పీ) విధానం పటిష్ఠంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాశ్‌ చౌధరి శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యుడు తిరుచి శివ వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సాగులో వైవిధ్యీకరణ, ప్రకృతి వ్యవసాయం, కనీస మద్దతుధర అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు.   కమిటీలో రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.

8న వెంకయ్యనాయుడికి వీడ్కోలు

ఆగస్టు పదో తేదీన పదవీ విరమణ చేయనున్న ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి సోమవారం (8న) రాజ్యసభ వీడ్కోలు పలుకనున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ ప్రకటించారు. వివిధ పార్టీల నేతలు వీడ్కోలు ప్రసంగాలు చేసేందుకు వీలుగా ఆ రోజు జీరో అవర్‌ ఉండదన్నారు.


తప్పనిసరి ఓటింగ్‌ ఆచరణ సాధ్యం కాదు

దేశంలో తప్పనిసరి ఓటింగ్‌ విధానాన్ని అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో స్పష్టంచేసింది. ఈ మేరకు ఓ ప్రైవేటు సభ్యుడి బిల్లును ఉపసంహరించారు. బిహార్‌లోని మహరాజ్‌గంజ్‌ భాజపా లోక్‌సభ సభ్యుడు జనార్ధన్‌ సింగ్‌ సిగ్రివాల్‌ ‘తప్పనిసరి ఓటింగ్‌’ను ప్రతిపాదిస్తూ లోక్‌సభలో 2019లో ప్రైవేటు సభ్యుడి బిల్లును ప్రవేశపెట్టారు. ఇలాంటి చట్టం వస్తే ప్రజాస్వామ్యం మరింత భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుందని, నల్లధనాన్ని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, ఈ విషయమై శుక్రవారం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్‌.పి.సింగ్‌ బఘేల్‌ మాట్లాడుతూ.. తప్పనిసరి ఓటింగ్‌పై సభ్యుల అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని, అయితే ఓటు హక్కును వినియోగించుకోని ప్రజలను దండించడమనేది అచరణ సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఈ బిల్లుపై సభ మూడేళ్లపాటు చర్చలు జరిపింది. మరోవైపు, మార్చి 2015లో లా కమిషన్‌ ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన తన నివేదికలో.. తప్పనిసరి ఓటింగ్‌ ఆలోచనను వ్యతిరేకించింది. భారత్‌లో ఇది ఆచరణ సాధ్యం కాదని స్పష్టంచేసింది.


మూడున్నరేళ్లలో 15.36 లక్షలమంది విద్యార్థుల విదేశీయానం

ఈనాడు, దిల్లీ:  గత మూడున్నరేళ్లలో మొత్తం 15,36,146 మంది భారతీయ విద్యార్థులు చదువులకోసం విదేశీ బాటపట్టారు. అందులో 3,74,732 (24.39%) మంది అమెరికా వెళ్లారు. తర్వాత అత్యధికంగా కెనడా (3,39,190- 22.08%), ఆస్ట్రేలియా (1,44,477- 9.40%)లకు పయనమయ్యారు. మొత్తం విద్యార్థుల్లో 55.88% మంది ఈ మూడుదేశాలనే ఎంచుకున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఈ మూడున్నరేళ్లలో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపించాయి. 2019లో మొత్తం 5,86,337 మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా 228 దేశాలకు వెళ్లగా, కరోనా కారణంగా 2020లో ఆ సంఖ్య 2,59,655కి తగ్గిపోయింది. సుమారు 55% తరుగుదల నమోదైంది. 2021లో పరిస్థితులు కుదుటపడటంతో 4,44,553 మంది బయటికెళ్లారు. అంతకుముందు ఏడాది కంటే అది 71% ఎక్కువ. అయితే కరోనా ముందునాటితో పోలిస్తే 24% తక్కువే. 2022 జూన్‌ 30 నాటికి 2,45,601 మంది విద్యార్థులు విదేశాలకెళ్లారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని