Hightech War: హైటెక్‌ యుద్ధాలకు భారత్‌ సన్నద్ధం!

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జరిగే హైటెక్‌ యుద్ధాలకు భారత్‌ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా సాధన సంపత్తిని సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టింది. ప్రస్తుతమున్న వ్యవస్థల సమర్థతను పరీక్షిస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో

Updated : 06 Aug 2022 08:26 IST

ఉక్రెయిన్‌ పోరులో ఆధునిక కమ్యూనికేషన్‌ పాత్రపై విశ్లేషణ  

దిల్లీ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జరిగే హైటెక్‌ యుద్ధాలకు భారత్‌ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా సాధన సంపత్తిని సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టింది. ప్రస్తుతమున్న వ్యవస్థల సమర్థతను పరీక్షిస్తోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఆధునిక కమ్యూనికేషన్‌, సైబర్‌, విద్యుదయస్కాంత వ్యవస్థల ప్రభావంపై అధ్యయనం చేపట్టి, ఆ దిశగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. భారత సైన్యం ‘స్కైలైట్‌’ పేరిట జులై 25 నుంచి 29 వరకూ విన్యాసాలు నిర్వహించింది. ఆ సందర్భంగా రోదసిలోని తన వ్యవస్థలను పరీక్షించింది. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్‌ను పరిశీలించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు సంబంధించిన అనేక ఉపగ్రహాలను సైన్యం ఉపయోగించుకుంటోంది. విన్యాసాల్లో స్టాటిక్‌, రవాణా యోగ్యమైన, సైనికులు మోసుకెళ్లే వీలున్న టెర్మినళ్లను అధికారులు పరీక్షించారు. శత్రు భూభాగంలో కూడా పనిచేసే వీలున్న చిన్నపాటి ట్యాక్టికల్‌ కమ్యూనికేషన్‌ సాధనాలు చాలా కీలకమని ఉక్రెయిన్‌ యుద్ధ అనుభవాల ఆధారంగా సైన్యం గుర్తించింది. స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ‘స్టార్‌లింక్‌’ తరహా విశ్వసనీయ ఉపగ్రహ కమ్యూనికేషన్‌ సమర్థత కూడా ఈ పోరులో రుజువైందని గమనించింది. ఈ పాఠాల ఆధారంగా పరిశ్రమలు, విద్యా సంస్థల భాగస్వామ్యంతో.. చేతిలో ఇమిడిపోయే, భద్రమైన ఉపగ్రహ ఫోన్లను అభివృద్ధి చేయడానికి సైన్యం కసరత్తు చేస్తోంది.

‘క్వాంటమ్‌’ దాడులను తట్టుకోవడానికి  

ఈ ఆధునిక యుగంలో సమాచార భద్రతపై కూడా సైన్యం దృష్టి పెట్టింది. శత్రుదేశపు క్వాంటమ్‌ కంప్యూటర్‌ దాడులను ఎదుర్కోవడానికి సమర్థ విధానాలను రూపొందిస్తోంది. సంప్రదాయ క్రిప్టోగ్రాఫిక్‌ వ్యవస్థలను క్వాంటమ్‌ కంప్యూటర్ల సాయంతో పూర్తిగా లేదా పాక్షికంగా ఛేదించే వీలుంది. ఈ సామర్థ్యం.. ఒక దేశానికి పెద్ద ఆయుధం. దీనిద్వారా శత్రుదేశపు సున్నిత వ్యవస్థలను దెబ్బతీయవచ్చు. ఫలితంగా ఆ దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిపోతుంది. ఇలాంటి పరిస్థితి మనకు ఎదురుకాకుండా సంప్రదాయ క్రిప్టోగ్రఫీ స్థానంలో క్వాంటమ్‌ నిరోధక క్రిప్టోగ్రఫిక్‌ సాధనాలను సమకూర్చుకోవడానికి సైన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని