PM Modi: మోదీతో మమత భేటీ

పశ్చిమబెంగాల్‌కు వివిధ పథకాల కింద కేంద్రం నుంచి అందాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలని, జీఎస్టీ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు

Updated : 06 Aug 2022 05:46 IST

రహస్య ఒప్పందంపై అనుమానాలు!

దిల్లీ: పశ్చిమబెంగాల్‌కు వివిధ పథకాల కింద కేంద్రం నుంచి అందాల్సిన నిధులను సకాలంలో విడుదల చేయాలని, జీఎస్టీ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశం చిత్రాన్ని ప్రధాని కార్యాలయం విడుదల చేసింది. ఆయా కార్యక్రమాల అమలుకు నిధుల విడుదలలో జాప్యం జరగకుండా ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ మమత ఈ సందర్భంగా ఓ వినతిపత్రాన్ని మోదీకి అందజేశారు.  ప్రధానితో భేటీ అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు మమతా బెనర్జీ వెళ్లారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీకి వచ్చిన దీదీ ఆదివారం ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు. శనివారం కీలక ప్రతిపక్ష నేతలతో ఆమె భేటీ అవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


‘సెట్టింగ్‌’ లేదు కదా?: మాజీ గవర్నర్‌

పశ్చిమబెంగాల్‌లో కేంద్ర దర్యాప్తుసంస్థల దాడులు, శనివారం జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నిక వంటి అంశాలు కూడా మోదీ, మమతల మధ్య భేటీలో చర్చకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. భాజపా సీనియర్‌ నేత, మాజీ గవర్నర్‌ తథాగత రాయ్‌ ప్రధానిని ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్‌ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ‘సెట్టింగ్‌ గురించి బెంగాల్‌ భయపడుతోంది. మోదీజీ, మమతల మధ్య రహస్య ఒప్పందం ఏదో జరిగిందన్నది దాని అర్థం. దయచేసి, అలాంటిదేం లేదని మాకు భరోసా ఇవ్వండి’ అని మోదీని కోరుతూ ఆయన ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని