Azadi Ka Amrit Mahotsav: వీరుడా... విలనా?

విభజించు... పాలించు సూత్రాన్ని అనుసరించి భారత్‌ను ఏలిన ఆంగ్లేయులకు దేశాన్ని వదిలి వెళ్లడానికీ విభజనే తోడైంది. సమకాలీన ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, అసాధ్యమనుకున్న ఆ ప్రక్రియను పూర్తి చేసిన సాధకుడు లార్డ్‌ మౌంట్‌బాటెన్‌!

Updated : 07 Aug 2022 07:00 IST

విభజించు... పాలించు సూత్రాన్ని అనుసరించి భారత్‌ను ఏలిన ఆంగ్లేయులకు దేశాన్ని వదిలి వెళ్లడానికీ విభజనే తోడైంది. సమకాలీన ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, అసాధ్యమనుకున్న ఆ ప్రక్రియను పూర్తి చేసిన సాధకుడు లార్డ్‌ మౌంట్‌బాటెన్‌! అయితే.. చిక్కుముడులను విప్పి వలస పాలనను ముగించినందుకు ఆయన్ను వీరుడనాలా?... కోట్ల మంది ధన, మాన ప్రాణాలను హరించి, దారుణ మారణహోమానికి దారితీసి... ఇప్పటికీ చల్లారని పొగను రాజేసినందుకు విలన్‌ అనాలా???

బ్రిటన్‌ వైస్రాయ్‌లంతా భారత్‌పై ఆంగ్లేయుల పట్టు మరింతగా బిగించటానికి ప్రయత్నించిన వారే! కానీ ఒక్క మౌంట్‌బాటెన్‌ మాత్రమే... ఆ పట్టును సాధ్యమైనంత త్వరగా తొలగించటానికి వచ్చాడు... లూయిస్‌ ఫ్రాన్సిన్‌ అల్బర్ట్‌ విక్టర్‌ నికోలస్‌ మౌంట్‌బాటెన్‌. అలియాస్‌.. లార్డ్‌ మౌంట్‌బాటెన్‌! బ్రిటన్‌ రాకుమారుడు లూయిస్‌ బాటెన్‌బర్గ్‌, రాకుమారి విక్టోరియా హెస్సె దంపతులకు లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ 1900 జూన్‌ 25న జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆగ్నేయాసియా బ్రిటిష్‌ కమాండ్‌ సర్వసేనాధిపతిగా వ్యవహరించాడు.

వీలైతే కలిపి ఉంచు... లేదంటే విభజించు... అంటూ లండన్‌ నుంచి లభించిన సర్వాధికారాలతో... 1947 మార్చిలో భారత్‌లో అడుగుపెట్టాడు మౌంట్‌బాటెన్‌. ముస్లింలీగ్‌ అధినేత మహమ్మద్‌ అలీ జిన్నాతో సమావేశమైన మౌంట్‌బాటెన్‌... పాకిస్థాన్‌ ఏర్పాటుకు ప్రాతిపదికేంటని ప్రశ్నించారు. దానికి జిన్నా వద్ద సమాధానం లేదు. హిందూ-ముస్లింలు కలసి బతకటం అసాధ్యం అనేదే జిన్నా వాదన. అదే విభజన కోరడానికి ప్రాతిపదిక. అందుకే జిన్నాను ‘ఓ మూర్ఖుడు’ అని అభివర్ణించారు మౌంట్‌బాటెన్‌.

కాంగ్రెస్‌ను ఒప్పించి...

పాకిస్థాన్‌ను డిమాండ్‌ చేస్తూ... ముస్లింలీగ్‌ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. మతకల్లోలాలతో పంజాబ్‌, బెంగాల్‌లు అట్టుడుకుతున్నాయి. దేశం ఐక్యంగా ఉన్నా... ముస్లింలీగ్‌తో కలసి అధికారం పంచుకోవటం కష్టమనే విషయం కాంగ్రెస్‌ నేతలకూ తెలిసొచ్చింది. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకొని... మౌంట్‌బాటెన్‌ కాంగ్రెస్‌ మనసు మార్చారు. నెహ్రూ, పటేల్‌లను ఒప్పించారు. గాంధీజీని ప్రసన్నం చేసుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు మహాత్ముడు అడ్డుచెప్పకుండా చూసుకున్నారు.

సంస్థానాల బుజ్జగింపు

మరో సమస్య... సంస్థానాల రూపంలో ఎదురైంది. ఇన్నాళ్లూ ఆంగ్లేయ సర్కారుకు విశ్వాసపాత్రంగా ఉంటున్న తమని పట్టించుకోకపోవటమేంటనే ప్రశ్న తలెత్తింది. వైస్రాయ్‌గా సంస్థానాధీశుల వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని వారిని విలీనం వైపు నడిపించారు మౌంట్‌బాటెన్‌. బ్రిటిష్‌ ప్రభుత్వం ఏ సంస్థానానికీ ప్రత్యేక హోదా ఇవ్వదని స్పష్టం చేశారు. స్వతంత్రంగా ఉండే ఆలోచన చేయొద్దని... ఏదో ఒక దేశంలో చేరాలని సలహా ఇచ్చి... చాలా సంస్థానాలను స్వయంగా ఒప్పించారు.

అయిదు నిమిషాల్లో ఆమోదం

దేశ విభజన ఎలా చేయాలనే దానిపై తొలుత స్పష్టత లేదు. భారత్‌, పాకిస్థాన్‌లతోపాటు బెంగాల్‌, పంజాబ్‌, బొంబాయి, మద్రాసు, యునైటెడ్‌ ప్రావిన్సులు, వాయవ్య రాష్ట్రాలు... స్వతంత్రంగా ఉండేలా ఓ ప్రణాళిక రచించారు మౌంట్‌బాటెన్‌. దీనికి తీవ్ర వ్యతిరేకత రావడంతో... తన రాజ్యాంగ సలహాదారు మేనన్‌ సూచన మేరకు... విభజనను భారత్‌-పాక్‌ల మేరకే కుదించారు. అదే ప్రణాళికతో లండన్‌కు చేరి అక్కడ ప్రధానమంత్రి, మంత్రివర్గం ముందుంచి, 5నిమిషాల్లోనే ఆమోదింపజేసుకున్నారు. 1947 మే 31న తిరిగివచ్చి నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌, జిన్నా, లియాఖత్‌ అలీ తదితరులతోనూ మమ అనిపించారు. ఐక్యభారత్‌ను భారత్‌, పాకిస్థాన్‌లుగా ఆగస్టు 15న విభజిస్తామని 1947 జూన్‌ 3న ప్రకటించారు. బ్రిటన్‌ ప్రధాని చెప్పిన 1948, జూన్‌ 30 గడువుకంటే 10 నెలల ముందుగానే భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించిన ఘనత మౌంట్‌బాటెన్‌కే దక్కుతుంది. తర్వాత రాడ్‌క్లిఫ్‌ను పిలిపించి... సరిహద్దుల విభజన పూర్తిచేశారు. తగినంత సమయం ఇచ్చినా వాడుకోలేదని, రక్తపాతం లేకుండా అధికార బదిలీ చేయడంలో విఫలమయ్యాడని... కోట్ల మంది ధనమాన ప్రాణాలు కోల్పోవటానికి కారణమయ్యాడనే ముద్ర మౌంట్‌బాటెన్‌పైనే పడింది.

ప్రపంచ చరిత్రలోనే కీలక ఘట్టంలో ముఖ్యపాత్ర పోషించిన లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ 1947, ఆగస్టు 15 వరకు చివరి వైస్రాయ్‌(బ్రిటిష్‌ ఇండియా)గా, స్వతంత్ర భారత్‌కు 1948, జూన్‌ 21 వరకు మొట్టమొదటి గవర్నర్‌ జనరల్‌గా వ్యవహరించారు. అనంతరం ఇంగ్లండ్‌కు వెళ్లి తన విధుల్లో చేరారు. 1979, ఆగస్టు 27న తన మనవడు, కుటుంబసభ్యులతో కలిసి ఐర్లాండులోని ఓ నదిలో విహరించడానికి పడవలో వెళ్లారు. ఆ పడవకు ఐరిష్‌ రిపబ్లికన్‌ ఆర్మీ(ఐఆర్‌ఏ) అమర్చిన బాంబు పేలడంతో  మనవడు, కుటుంబ సభ్యులతో సహా మౌంట్‌బాటెన్‌ దుర్మరణం చెందారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని