హిందూ-ముస్లింలు భుజాలు కలపగా.. కోవెలకు తరలివచ్చెను స్వామి!

అది జమ్మూ-కశ్మీర్‌లోని ఓ కొండప్రాంతంపై ఉన్న పురాతన శివాలయం. దాని పునర్నిర్మాణం ఈమధ్యే పూర్తయింది. అక్కడ ప్రతిష్ఠించడానికి రాజస్థాన్‌ నుంచి ఆరు భారీ గ్రానైట్‌ విగ్రహాలను తీసుకొచ్చారు. కానీ రహదారి సౌకర్యం లేని చోట కొండపైకి

Published : 07 Aug 2022 05:39 IST

దేవతల విగ్రహాల తరలింపులో ముస్లింల స్వచ్ఛంద సేవ
జమ్మూ-కశ్మీర్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం

భద్రవాహ్‌: అది జమ్మూ-కశ్మీర్‌లోని ఓ కొండప్రాంతంపై ఉన్న పురాతన శివాలయం. దాని పునర్నిర్మాణం ఈమధ్యే పూర్తయింది. అక్కడ ప్రతిష్ఠించడానికి రాజస్థాన్‌ నుంచి ఆరు భారీ గ్రానైట్‌ విగ్రహాలను తీసుకొచ్చారు. కానీ రహదారి సౌకర్యం లేని చోట కొండపైకి వాటిని తరలించడం కష్టసాధ్యంగా మారింది. పెద్ద ఎత్తున మనుషులు, యంత్రాల సాయం ఉంటే తప్ప విగ్రహాలను కోవెలలోకి చేర్చలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో మేమున్నామంటూ ముందుకొచ్చారు ముస్లిం సోదరులు. అప్పటికప్పుడు పంచాయతీ నిధులతో రహదారి నిర్మించడమే కాదు.. విగ్రహాలను కొండపైకి తరలించడానికి హిందువులతో భుజం కలిపారు. నాలుగురోజుల పాటు అలుపన్నది లేకుండా శ్రమించారు. వీరికి భారత సైన్యం సాయం కూడా తోడైంది. దీంతో దేవతల విగ్రహాలు గుడికి చేరడానికి మార్గం సుగమమైంది. మత సామరస్యానికి అసలైన నిర్వచనం లాంటి ఈ దృశ్యం జమ్మూ-కశ్మీర్‌ డోడా జిల్లాలోని కుర్సారీ గ్రామంలో కనిపించింది. ఒక్కోటి 500 నుంచి 700 కిలోల బరువున్న 6 విగ్రహాలను రాజస్థాన్‌ నుంచి తీసుకురాగా.. వాటిని కొండపైకి 3 కి.మీ. దూరం తరలించడం దేవాలయ నిర్మాణ కమిటీకి కష్టంగా మారింది. ఈ విషయం తెలిసిన కుర్సారీ పంచాయతీ సర్పంచి సాజిద్‌ మిర్‌ తక్షణం స్పందించారు. కొండపైకి తాత్కాలిక రహదారి నిర్మాణానికి రూ.4.6 లక్షల పంచాయతీ నిధులు కేటాయించారు. గ్రామంలో తన సామాజిక వర్గానికి చెందిన 150 మందిని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పురమాయించారు. దీంతో గత నాలుగు రోజులుగా ఇరు వర్గాల్లోని వాలంటీర్లు చేయి చేయి కలిపి తాళ్లు, యంత్రాలతో విగ్రహాలను కొండపైకి చేర్చే పనిచేపట్టారు. వీరి సామరస్యాన్ని గమనించిన మిలిటరీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్‌, రహదారి నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు తమవంతు చేయూత ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. సైనిక యూనిట్‌.. అవసరమైన యంత్రసామగ్రిని, సిబ్బందిని పంపింది. ఈ నెల 9న శివాలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ‘‘ఇదే మన సంస్కృతి. ఇవే మన విలువలు. వీటినే మేం వారసత్వంగా పొందాం. ఈ భావాల కారణంగానే మేం ఎన్నడూ.. మతం పేరుతో వేరుచేయాలనే వారి కుట్రల బారినపడలేదు’’ అని సర్పంచి సాజిద్‌ మిర్‌ తెలిపారు. ‘‘ఒకానొక దశలో ఈ విగ్రహాలను కొండపైకి చేర్చడం అసాధ్యమనిపించింది. ఆ సమయంలో మా ఇరుగుపొరుగు వారి ప్రేమ, ఆప్యాయత చూసి మా మనసు ద్రవించింది’’ అని ఆలయ కమిటీ ఛైర్మన్‌ రవీందర్‌ ప్రదీప్‌ చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని