అత్యాచారం కేసులో బీఎస్పీ ఎంపీ అతుల్‌కు ఊరట

అత్యాచారం, మోసం కేసులో అరెస్టై మూడేళ్లుగా జైల్లో ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్‌ కుమార్‌ సింగ్‌ అలియాస్‌ అతుల్‌రాయ్‌కి కోర్టులో ఊరట లభించింది. వారణాసిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శనివారం ఆయన్ను నిర్దోషిగా

Published : 07 Aug 2022 05:39 IST

నిర్దోషిగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు
గతేడాది సుప్రీం కోర్టు ఎదుట ఆత్మహత్య చేసుకున్న ఫిర్యాది

వారణాసి, ఈనాడు-లఖ్‌నవూ: అత్యాచారం, మోసం కేసులో అరెస్టై మూడేళ్లుగా జైల్లో ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్‌ కుమార్‌ సింగ్‌ అలియాస్‌ అతుల్‌రాయ్‌కి కోర్టులో ఊరట లభించింది. వారణాసిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శనివారం ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ఎంపీపై కేసు పెట్టిన మహిళ తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో తన స్నేహితుడితో కలసి గతేడాది సుప్రీం కోర్టు ఎదుట ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోసి నియోజకవర్గ ఎంపీˆ అయిన అతుల్‌రాయ్‌తో పాటు మరికొందరిపై 2019 మే 1న ఆ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. అతుల్‌రాయ్‌ తనను వారణాసిలోని అతడి ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారని, ఆ సమయంలో అభ్యంతరకర వీడియోలు, ఫొటోలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది.  ఈక్రమంలో అదే ఏడాది జూన్‌ 22న అతుల్‌ కోర్టులో లొంగిపోయారు. అప్పట్నుంచి ఆయన ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ జైల్లో గడుపుతున్నారు.

ఫేస్‌బుక్‌ లైవ్‌ పెట్టి.. నిప్పు అంటించుకుని..

ఈ కేసులో తనకు న్యాయం జరగకుండా ఎంపీ, సీనియర్‌ పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని ఆ మహిళ గతేడాది ఆరోపణలు చేసింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన తన స్నేహితుడితో కలసి ఆమె గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు వద్దకు వచ్చి.. ఫేస్‌బుక్‌ లైవ్‌లో తనకు జరుగుతున్న అన్యాయాన్ని వెల్లడించింది. ఇద్దరూ ఒంటికి నిప్పంటించుకోవడంతో.. తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. వారిని ఆత్మహత్యకు ప్రేరేపించడంతోపాటు కుట్ర పన్నినట్లు అతుల్‌రాయ్‌పై మరో కేసు నమోదైంది. అరెస్టుచేశారు. అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ ఇవ్వలేదు.

అయినా జైల్లోనే: అత్యాచారం కేసులో నిర్దోషిగా కోర్టు ప్రకటించినప్పటికీ అతుల్‌రాయ్‌ వెంటనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. ఆత్మహత్యకు ప్రేరేపించడంతోపాటు కుట్ర పన్నినట్లు నమోదైన కేసులో బెయిల్‌ వచ్చేవరకూ ఆయన జైల్లోనే గడపాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని