Updated : 08 Aug 2022 05:17 IST

Venkaiah naidu: ఐదేళ్లు.. వెయ్యి కార్యక్రమాలు

ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి రికార్డు  
అన్ని రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టిన నేత

ఈనాడు, దిల్లీ: దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని చుట్టిన ఉప రాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఐదేళ్ల పదవీకాలంలో ఆయన ప్రతి రాష్ట్రాన్ని, కేంద్రపాలిత ప్రాంతాన్ని చుట్టివచ్చారు. వెయ్యికిపైగా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలను సందర్శించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రాజెక్టులను ప్రారంభించారు. విభిన్న అంశాలపై పనిచేసే ప్రజలు, నిపుణులతో మమేకమయ్యారు. భాజపా అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో దేశమంతటా విస్తృతంగా పర్యటించిన అనుభవం ఉన్న ఆయన ఉపరాష్ట్రపతి హోదాలోనూ అదే ఒరవడి కొనసాగించారు. భారత్‌ మళ్లీ విశ్వగురు స్థానాన్ని అధిష్ఠించాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు. విద్యావంతులు, నిపుణులు, విద్యార్థులు, రైతులు, పౌరసమాజ ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు ఉపరాష్ట్రపతి నివాస భవనంలో ఒక సమావేశ మందిరాన్ని నిర్మింపజేశారు. తన పనితీరును ప్రజల ముందుంచేందుకు ‘మూవింగ్‌ ఆన్‌ మూవింగ్‌ ఫార్వర్డ్‌’ పేరుతో ఏటా ‘కాఫీ టేబుల్‌ బుక్‌’ను తీసుకొచ్చారు.

నేడు రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం

ఈ నెల 10వ తేదీతో ఉప రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న వెంకయ్యనాయుడికి పెద్దల సభ సోమవారం వీడ్కోలు పలకనుంది. రాజ్యసభ ఛైర్మన్‌గా అయిదేళ్లపాటు ఆయన నిర్వహించిన భూమికపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు, వివిధ పార్టీల నేతలు, ఇతర సభ్యులు మాట్లాడనున్నారు. సాయంత్రం రాజ్యసభ సభ్యుల తరఫున పార్లమెంటు ఆవరణలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మరో వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో ప్రధానమంత్రి పాల్గొని వెంకయ్యనాయుడికి జ్ఞాపికను బహూకరించనున్నారు. డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. వెంకయ్యనాయుడి హయాంలో జరిగిన వివిధ కార్యక్రమాల సమాహారంతో వెలువరించిన పుస్తకాన్ని ప్రధానమంత్రి విడుదల చేస్తారు.


వెంకయ్యనాయుడిని కలిసిన ధన్‌ఖడ్‌

దిల్లీ: నూతన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని ఆదివారం కలిశారు. ధన్‌ఖడ్‌ తన సతీమణి సుదేశ్‌తో కలిసి ఉప రాష్ట్రపతి నివాసానికి వెళ్లగా వెంకయ్యనాయుడు దంపతులు సాదరంగా ఆహ్వానం పలికారు. ధన్‌ఖడ్‌కు అభినందనలు తెలిపిన వెంకయ్యనాయుడు కండువాతో సత్కరించారు. 30 నిమిషాలకు పైగా భేటీ అనంతరం ఉప రాష్ట్రపతి నివాసం, సచివాలయాలను ధన్‌ఖడ్‌కు చూపించారు. సచివాలయ సిబ్బందిని పరిచయం చేశారు.

ఈసీ ధ్రువపత్రం జారీ..

దేశ ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎన్నికైనట్లుగా ఈసీ (ఎన్నికల సంఘం) ఆదివారం ధ్రువపత్రాన్ని జారీ చేసింది. ఎన్‌డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన శనివారం జరిగిన ఎన్నికలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈమేరకు దేశ 14వ ఉప రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ధన్‌ఖడ్‌ ఎన్నిక ధ్రువపత్రంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర  పాండే సంతకాలు చేశారు. ధ్రువపత్రం ప్రతిని డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ధర్మేంద్ర శర్మ, ఈసీ ముఖ్య కార్యదర్శి నరేంద్ర ఎన్‌.బుటోలియాలు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అందజేశారు. ఈనెల 11న ఉప రాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా దీన్ని చదువుతారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts