MonkeyPox: తొలి రెండు మంకీపాక్స్‌ కేసుల్లోనూ ‘ఏ.2’ వైరస్‌

దేశంలో బయటపడిన తొలి రెండు మంకీపాక్స్‌ కేసులకు ‘ఏ.2’ వైరస్‌ రకం కారణమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ) అధ్యయనం వెల్లడించింది. ఈ ఇద్దరు బాధితులూ యూఏఈ నుంచి కేరళకు

Updated : 08 Aug 2022 06:22 IST

ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవీ అధ్యయనం

దిల్లీ: దేశంలో బయటపడిన తొలి రెండు మంకీపాక్స్‌ కేసులకు ‘ఏ.2’ వైరస్‌ రకం కారణమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ) అధ్యయనం వెల్లడించింది. ఈ ఇద్దరు బాధితులూ యూఏఈ నుంచి కేరళకు తిరిగివచ్చినవారే. ఇది (ఏ.2) ఐరోపాలో వ్యాప్తిలో ఉన్న మంకీపాక్స్‌ వైరస్‌ కంటే భిన్నమైనదనిగా పేర్కొంది. గత ఏడాది అమెరికాలో కనుగొన్న ఈ ‘ఏ.2’ రకం వ్యాధి ఉద్ధృతంగా ఉన్న ప్రాంతాల్లో లేదు. ప్రస్తుతం మంకీపాక్స్‌ వ్యాప్తికి ప్రధానంగా బీ.1 రకం కారణమని ప్రధాన అధ్యయనకర్త, ఎన్‌ఐవీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రగ్యా యాదవ్‌ తెలిపారు. అధ్యయన వివరాలు ఆన్‌లైన్‌ వేదిక ‘రీసెర్చ్‌ స్క్వేర్‌’లో ప్రచురితమయ్యాయి. దేశంలో ఇంతవరకు 9 మంకీపాక్స్‌ కేసులు నమోదుకాగా తొలి 2 కేసులపై సమగ్ర జన్యుక్రమ విశ్లేషణ జరిపినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. వీటికి పశ్చిమ ఆఫ్రికన్‌ రకమైన ‘ఏ.2’ కారణమని నిర్ధరించారు. 2022లో వ్యాప్తి చెందిన ఇన్‌ఫెక్షన్లలో ఇదే కనిపిస్తోందని డాక్టర్‌ యాదవ్‌ వెల్లడించారు. మధ్య ఆఫ్రికాలో (కాంగో బేసిన్‌) వ్యాప్తిలో ఉన్న రకంతో పోలిస్తే ఇది అంత తీవ్రమైనది కాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని