క్యాన్సర్‌ కణాలను బంధించే చికిత్స

క్యాన్సర్‌కు ఒక వినూత్న చికిత్సను అమెరికా శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. ఇది క్యాన్సర్‌ కణాలను ఒకేచోట బంధించేస్తుంది. తద్వారా శరీరంలో ఇతర ప్రాంతాలకు అవి వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది. కాలిఫోర్నియా, వాషింగ్టన్‌

Updated : 08 Aug 2022 06:21 IST

వాషింగ్టన్‌: క్యాన్సర్‌కు ఒక వినూత్న చికిత్సను అమెరికా శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. ఇది క్యాన్సర్‌ కణాలను ఒకేచోట బంధించేస్తుంది. తద్వారా శరీరంలో ఇతర ప్రాంతాలకు అవి వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది. కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ ఘనత సాధించారు. శాస్త్రవేత్తలు 19ఏ11 అనే మోనోక్లోనల్‌ యాంటీబాడీని అభివృద్ధి చేశారు. అది ఇ-క్యాడెరిన్‌ అనే ప్రొటీన్‌తో బంధం ఏర్పరుస్తుంది. కణాలు ఒకదానితో ఒకటి అతుక్కునేలా ఈ ప్రొటీన్‌ చూస్తుంది. ముఖ్యంగా చర్మం, పేగులు, ఇతర అవయవాలకు సంబంధించిన ఎపిథీలియల్‌ పొరల్లో ఇలాంటి బంధాలను ఏర్పర్చడంలో తోడ్పాటు అందిస్తుంది. రక్త నాళాల నిర్మాణాన్ని పరిరక్షించడంలో ఇలాంటి పదార్థాలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. క్యాన్సర్‌.. ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా చూస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌, దానికి సంబంధించిన క్రోన్స్‌ వ్యాధి, ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌ వంటి రుగ్మతల చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల్లోని క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని అడ్డుకునే సత్తా 19ఏ11కు ఉందని ఎలుకలపై జరిగిన పరిశోధనలో వెల్లడైంది. ఈ యాంటీబాడీకి రెండు రకాల బంధన సామర్థ్యాలు ఉన్నట్లు సిమ్యులేషన్లు, అటామిక్‌ ఫోర్స్‌ మైక్రోస్కోపుతో జరిగిన పరిశోధనల్లో తేలింది. ఇందులో ఒకటి.. ఈ-క్యాడెరిన్‌ బంధన బలాన్ని పెంచుతుందని వెల్లడైంది. కణాల మధ్య బంధనాన్ని ఇది ఎలా పెంచుతుందన్నది మెరుగ్గా అర్థం చేసుకోవడం ద్వారా మరింత సమర్థ చికిత్సలను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని