వాతావరణ మార్పులతో కష్టమవుతున్న అంచనాలు: ఐఎండీ

వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వాతావరణ సంస్థలు కచ్చితమైన అంచనాలు రూపొందించడానికి అవరోధాలు ఎదురవుతున్నాయని ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు. ఈ

Updated : 08 Aug 2022 05:57 IST

దిల్లీ: వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వాతావరణ సంస్థలు కచ్చితమైన అంచనాలు రూపొందించడానికి అవరోధాలు ఎదురవుతున్నాయని ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు. ఈ సవాలును అధిగమించడానికి మరిన్ని రాడార్లను ఏర్పాటు చేయడంతో పాటు అధిక సామర్థ్యం ఉన్న గణన వ్యవస్థల్ని ఉన్నతీకరిస్తున్నామని పీటీఐ వార్తాసంస్థ ముఖాముఖిలో చెప్పారు. ‘‘ప్రస్తుత రుతుపవన వర్షాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేమీ కనిపించలేదు. అయితే (ఒకేచోట) అధిక వర్షపాతం నమోదు కావడం పెరిగి, తేలికపాటి జల్లులు కురవడం తగ్గింది. వాతావరణ మార్పుల వల్ల అస్థిరత పెరిగింది. ఉరుములు, పిడుగులు, భారీ వర్షపాతానికి ఇవి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరింత కచ్చితమైన అంచనాలను 2025 నాటికి ఇచ్చేలా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం. పంచాయతీ స్థాయి వరకు, నగరాల్లో నిర్దిష్ట ప్రాంతాల వరకు వాతావరణ అంచనాలను ఆ ఏడాది నాటికి ఇవ్వగలం. ఇప్పుడున్న 34 రాడార్లు 2025 నాటికి 67కి పెరుగుతాయి. ఒక గంటలో ఐదు సెం.మీ, అంతకు మించిన వర్షం కురవడానికి దారితీసే మినీ క్లౌడ్‌బరస్ట్‌ ఘటనలు హిమాలయాల్లో పెరుగుతున్నాయి. తుపానులు, వడగాలులు వంటివాటి కారణంగా వాటిల్లే మరణాలు ఇటీవలి ఏళ్లలో తగ్గాయి. వడగాలులను 92%, భారీ వర్షపాతాన్ని 79% కచ్చితమైన అంచనాతో చెప్పగలుగుతున్నాం’’ అని మహాపాత్ర వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని